కోదాడ, నవంబర్ 6, ( అద్దం న్యూస్ ) :
కోదాడ పట్టణంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి శుక్రవారం కోదాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి పట్టణంలో కొనసాగుతున్న అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ (యూజీడీ) పనులు, మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై సమగ్రంగా చర్చించారు. అభివృద్ధి పనుల ప్రస్తుత స్థితిగతులు, నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలు, పనుల పురోగతి తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ… కోదాడ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించడంతో పాటు నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి పనులకు ఎదురవుతున్న అడ్డంకులను తొలగించాలని సూచించారు. రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో కోదాడ పట్టణాన్ని ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పేర్కొన్నారు. పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్, పబ్లిక్ హెల్త్, రెవెన్యూ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.