Addam News
Newspaper Banner
Date of Publish : 23 October 2026, 3:09 am Posted by : Addam News

యుద్ధ గీతాల సుద్దాల జాతీయ పురస్కారాలు – ఈ నెల‌ 26 న రవీంద్రభారతిలో ప్రదానోత్సవం

హైద‌రాబాద్‌, అక్టోబర్ 22, ( అద్దం న్యూస్ ) :     కాలుకు గజ్జ కట్టి, భుజాన గొంగడి వేసుకుని, ఒకవైపు గన్ను మరోవైపు పెన్ను పట్టుకుని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పల్లె పల్లెకు పాటను ప్రవహింపజేసిన యుద్ధ గీతాల రచయిత సుద్దాల హనుమంతు పేరిట 15వ జాతీయ పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 26న రవీంద్రభారతిలో ఘనంగా జరగనుంది. ఈ సంవత్సరం ప్రముఖ రచయిత్రి, 100 పుస్తకాల అనువాదకురాలు స్వాతి శ్రీపాదకు సుద్దాల జాతీయ పురస్కారం, అలాగే జాతీయ జానపద అవార్డు యక్షగాన కళాకారుడు మహమ్మద్ అక్బర్ పాషా కు అందజేయనున్నట్లు సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు సుద్దాల అశోక్ తేజ తెలిపారు. హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ… ఈ నెల 26న సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో సాంస్కృతిక ఉత్సవాలతో పాటు అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుందని ప్రకటించారు. సుద్దాల గొంతు నుండి పాటలను తూటాలుగా మలిచి, ప్రజా శక్తులను ఉద్యమ బాట పట్టించిన ఆ కంచు కంఠం సుద్దాల హనుమంతు అని, ఆయన ప్రజా వాగ్గేయ వారసత్వాన్ని వారి మనవలు, మనుమరాలు నిరంతరాయంగా కొనసాగిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఐఏఎస్ కెవి.రమణాచారి, అద్దంకి దయాకర్, వెలిదండ నిత్యానందరావు, నెల్లుట్ల రమాదేవి, సుద్దాల సుధాకర్ తేజ, తాటి రమేష్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. సుద్దాల హనుమంతు, జానకమ్మల స్ఫూర్తిని, ప్రజా పాటల వారసత్వాన్ని తాను బతికినంత కాలం, తన తర్వాత కూడా వారి వారసులు నిర్వహించేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నానని అశోక్ తేజ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జి.రాములు, భూపతి వెంకటేశ్వర్లు, వలస సుభాష్ చంద్రబోస్, ఎన్.సోమయ్య, మందుల విప్లవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.