వెబ్ డెస్క్, ( అద్దం న్యూస్ ) : ప్రముఖ భారతీయ సినీ దర్శకుడు, స్క్రీన్ప్లే రచయిత, సంగీత దర్శకులు సింగీతం శ్రీనివాసరావు ( 94 ) మృతి చెందారు. చెన్నైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వయోభారంతో సింగీతం శ్రీనివాసరావు తుదిశ్వాస విడిచారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఆరు దశాబ్దాలకు పైగా కెరీర్లో 60కి పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆదిత్య 369, భైరవద్వీపం, పుష్పక విమానం, అమవాస్య చంద్రుడు, మయూరి వంటి విలక్షణమైన, ప్రయోగాత్మక చిత్రాలతో భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కేవీ రెడ్డి వద్ద మాయాబజార్ చిత్రానికి సహాయకుడిగా కెరీర్ ప్రారంభించిన ఆయన, తన చివరి దశలోనూ సృజనాత్మకతను కోల్పోకుండా 94 ఏళ్ల వయసులో ‘ సింగ్ గీతం ’ అనే చిత్రానికి దర్శకత్వం వహించి అరుదైన రికార్డు సృష్టించారు. ఆయన మృతి పట్ల తెలుగు, దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.