హైదరాబాద్, అక్టోబర్ 12, ( అద్దం న్యూస్ ) : మైనార్టీ గురుకులాల్లో పనిచేస్తున్న నాన్ శాంక్షన్ పోస్ట్ ( NSP ) డైలీ వేజ్ వర్కర్లకు రూ.30 వేల వేతనం ఇవ్వాలని, వారిని ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన క్రమబద్ధీకరించాలని, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద మైనార్టీ గురుకుల నాన్ శాంక్షన్ పోస్ట్ ( NSP ) డైలీ వేజ్ వర్కర్లు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు మద్దతుగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ… నాన్ శాంక్షన్ పోస్ట్ ( NSP ) డైలీ వేజ్ వర్కర్లకు ఈఎస్ఐ, ఈపీఎఫ్ సౌకర్యాలు కల్పించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేస్తున్న నాన్ శాంక్షన్ పోస్ట్ ( NSP ) డైలీ వేజ్ వర్కర్లను ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిన క్రమబద్ధీకరించకపోవడం వల్ల వాళ్ళు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాష్ట్రంలోని 204 మైనార్టీ గురుకులాల్లో పని చేస్తున్న సుమారు 3500 వేల మంది నాన్ శాంక్షన్ పోస్ట్ ( NSP ) డైలీ వేజ్ వర్కర్లకు నెలకు రూ.30 వేల వేతనం చెల్లించాలని కోరారు. సంవత్సరం మొత్తం కేవలం 10 నెలలు మాత్రమే పనికి పిలుస్తున్నారని, మిగతా రెండు నెలలు పని బకపోవడం వల్ల వారి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. కొన్ని నెలల పాటు జీతాలు చెల్లించకపోవడంతో నాన్ శాంక్షన్ పోస్ట్ ( NSP ) డైలీ వేజ్ వర్కర్ల కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మైనార్టీ గురుకుల నాన్ టీచింగ్ నాన్ శాంక్షన్ పోస్ట్ వర్క్లనునాన్ శాంక్షన్ పోస్ట్ ( NSP ) డైలీ వేజ్ వర్కర్ల సంఘం నాయకులు, బీసీ సంఘాల నాయకులు యూనుస్, ఎస్.మంగ, మోహృజున్నిసా, వెంకన్న, రాజు, అక్బర్ భాష, జయమ్మ, రాష్ట్ర బీసీ ఐక్య కులాల వేదిక అధ్యక్షుడు అనంతయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ సి.రాజేందర్ ముదిరాజ్, బిసి సంక్షేమ సంఘం నాయకులు అల్లం యాదయ్య, మల్లేష్ యాదవ్, రఘుపతి తదితరులు పాల్గొన్నారు.