Addam News
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 4:36 am Posted by : Addam News

హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష

హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష
– వాటర్ లాగింగ్, ట్రాఫిక్ సమస్యలు లేకుండా చర్యలు చేపట్టాలి
– అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశం

హైద‌రాబాద్ బ్యూరో, సెప్టెంబర్ 22, ( అద్దం న్యూస్ ) :    హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. భారీ వర్షాల పరిస్థితిపై జీహెచ్‌ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్లతో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ మంగ‌ళ‌వారం ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండి క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. నగరంలోని వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద జీహెచ్‌ఎంసీ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, నిలిచిన నీటిని ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.

విద్యుత్, హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీస్, ట్రాఫిక్ తదితర అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ వర్షాల వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఒకవైపు గణేశ్ నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో, మరోవైపు భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వాటర్ లాగింగ్ లేకుండా చూడడంతో పాటు ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పోలీస్, ట్రాఫిక్ అధికారులను ఆదేశించారు.

ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు, వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులు తలెత్తిన ప్రాంతాల్లో వెంటనే స్పందించి ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. ప్రజలు కూడా అత్యవసరం కాని ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకుని, వర్షాల పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో భారీ వర్షాలపై పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png