కరీంనగర్, నవంబర్ 9, ( అద్దం న్యూస్ ) : ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధే లక్ష్యంగా అందరం కలిసి పని చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 26వ డివిజన్ బుట్టి రాజారామ్ కాలనీ రోడ్, సుభాష్ నగర్ ముదిరాజ్ కాలనీలో UIDF నిధుల నుండి కోటి రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ… కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో కలిసి కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. వ్యక్తిగత రాజకీయాలకు అతీతంగా జిల్లా అభివృద్ధి కోసం సమష్టిగా పనిచేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెడతామని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 70 నుంచి 90 శాతం పూర్తయి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. విద్యారంగ అభివృద్ధిలో భాగంగా భీమదేవరపల్లిలో నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదన చేశామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశామన్నారు.
జమ్మికుంట , హుస్నాబాద్‌లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని అడుగుతున్నామని, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం, ఫార్మసీ, ఇంజనీరింగ్ వంటి ఉన్నత విద్యా కోర్సులకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని పొన్నం తెలిపారు. అసంపూర్తిగా నిలిచిపోయిన మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటు వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. విద్య, వైద్యం, పారిశ్రామిక పార్కులు, మౌలిక సదుపాయాల కల్పనకు సమగ్ర ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ, గోదావరి జలసంపదతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అభివృద్ధిలో అపార అవకాశాలు ఉన్నాయన్నారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, కాళేశ్వరం, కొత్తకొండ ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఎలగందుల ఖిల్లా, ఇతర పర్యాటక ప్రాంతాలు, జలవనరుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కరీంనగర్ నగరంలో పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా అర్బన్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత ఇస్తామన్నారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి కోసం దాదాపు 1000 కొత్త పోస్టులకు ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. కరీంనగర్‌లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పేదలకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరామన్నారు. ప్రజలకు సంబంధించిన ఉమ్మడి సమస్యలను మా దృష్టికి తీసుకువస్తే సానుకూలంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
జిల్లాకు అవసరమైన అభివృద్ధి పనులపై జర్నలిస్టులు కూడా సూచనలు చేస్తూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనన్ని నిధులు తీసుకొచ్చి జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషి చేస్తామన్నారు. ఉత్తర తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన జిల్లాగా ఉమ్మడి కరీంనగర్‌ను తీర్చిదిద్దడమే మా లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, స్థానిక కార్పొరేటర్ వైద్యుల అంజన్ కుమార్, స్థానిక కార్పొరేటర్ గంట శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్లు గుమ్మడి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.