వేసవి నీటి సరఫరాపై ముందస్తు కార్యాచరణ సిద్ధం చేయాలి
– సింగూరు–మంజీరా ఆధారిత ప్రాంతాలకు ప్రత్యామ్నాయ జలవనరులతో ప్రాంతాలవారీ కాంటింజెన్సీ ప్రణాళిక
– పనిచేస్తున్న పవర్ బోర్‌వెల్స్‌కు 15 రోజుల్లో లైన్మెన్ ఇన్‌ఛార్జ్‌ల నియామకం
– పనిచేయని బోర్‌వెల్స్‌లో అత్యవసర అవసరాలకు ఉపయోగపడే వాటికి ప్రాధాన్య మరమ్మతులు
– నీటి వృథా నియంత్రణతో పాటు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి
– ఎస్టీపీల వద్ద ట్రీటెడ్ వాటర్ ఫిల్లింగ్ పాయింట్లను విస్తరించాలి
– ప్రైవేట్ ఎస్టీపీల సర్వే చేపట్టి 15 రోజుల్లో ట్రీటెడ్ వాటర్ లభ్యత మ్యాపింగ్ పూర్తి చేయాలి
– ఎండి అశోక్ రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 1, ( అద్దం న్యూస్ ) : రానున్న వేసవిలో నగర తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే సమగ్ర ముందస్తు కార్యాచరణతో సిద్ధంగా ఉండాలని జలమండలి ఎండి అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రస్తుత జలవనరులు, ప్రాంతాలవారీ నీటి డిమాండ్, పంపిణీ వ్యవస్థ, ప్రత్యామ్నాయ వనరులను సమగ్రంగా విశ్లేషించి క్షేత్రస్థాయిలో అమలు చేయగల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా సింగూరు–మంజీరా జలవనరులపై ఆధారపడిన ప్రాంతాల్లో సరఫరాపై ప్రభావం పడకుండా ప్రత్యామ్నాయ వనరుల ద్వారా నీటిని అందించేందుకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. వేసవి నీటి సరఫరా సన్నద్ధత, సింగూరు–మంజీరా కాంటింజెన్సీ ప్లాన్, పవర్ బోర్‌వెల్స్ పునరుద్ధరణ, ఫిల్లింగ్ స్టేషన్ల అవసరాలు, నెట్వర్క్ కనెక్టివిటీ, పారిశ్రామిక- బల్క్ నీటి సరఫరా, శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగం తదితర అంశాలపై బుధవారం ఖైరతాబాద్ ప్రధాన కార్యాలయంలో జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి అయన ఉన్నతస్థాయి ఎండీ సమీక్ష నిర్వహించారు.
సింగూరు- మంజీరా ప్రాంతాలకు ప్రత్యేక కార్యాచరణ :
సింగూరు- మంజీరా జలవనరులపై ఆధారపడిన ప్రాంతాలను గుర్తించి, అత్యవసర పరిస్థితుల్లో ఆయా ప్రాంతాలకు ఏ ప్రత్యామ్నాయ వనరు నుంచి, ఏ మార్గంలో, ఎంత పరిమాణంలో నీటిని అందించవచ్చనే వివరాలతో ప్రాంతాలవారీ కాంటింజెన్సీ ప్లాన్ సిద్ధం చేయాలని ఎండీ ఆదేశించారు. ప్రత్యామ్నాయ సరఫరాకు అవసరమైన ఇంటర్కనెక్షన్లు, జంక్షన్లు, వాల్వ్ ఆపరేషన్లు, పైప్‌లైన్ అనుసంధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. వేసవిలో అధిక డిమాండ్ ఉండే ప్రాంతాలు, చివరి ప్రాంతాలు, తక్కువ ఒత్తిడితో నీరు అందుతున్న ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట కొత్త పైప్లైన్లు, నెట్వర్క్ బలోపేత పనులకు సాంకేతిక ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు.
నీటి వృథా నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి :
రానున్న వేసవిలో పెరిగే నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నీటి వృథాను నియంత్రించడాన్ని అత్యంత ప్రాధాన్య అంశంగా పరిగణించాలని ఎండీ అధికారులను ఆదేశించారు. జలమండలి సరఫరా చేస్తున్న తాగునీటిని అనవసరంగా వృథా చేయడం, గృహేతర అవసరాలకు దుర్వినియోగం చేయడం వంటి వాటిని క్షేత్రస్థాయిలో గుర్తించి నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. ఉద్దేశపూర్వకంగా నీటిని వృథా చేస్తున్నట్లు గుర్తించిన సందర్భాల్లో ముందుగా అవగాహన కల్పించడంతో పాటు, పదేపదే నిబంధనలు ఉల్లంఘించే వారిపై అమల్లో ఉన్న నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో, కేవలం నియంత్రణ చర్యలకే పరిమితం కాకుండా నీటి సంరక్షణపై ప్రజల్లో బాధ్యతాయుతమైన వినియోగ సంస్కృతిని పెంపొందించేలా విస్తృత అవగాహన కార్యక్రమాన్ని రూపొందించాలని ఎండీ ఆదేశించారు. వేసవిలో నీటి డిమాండ్, అందుబాటులో ఉన్న జలవనరులు, నీటి వృథా వల్ల సరఫరా వ్యవస్థపై పడే ప్రభావం, ప్రతి కుటుంబం పాటించాల్సిన నీటి పొదుపు పద్ధతులను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించాలని సూచించారు. ఇందుకోసం మీడియా, సామాజిక మాధ్యమాలు, క్షేత్రస్థాయి ప్రచార కార్యక్రమాలు తదితర వేదికలను సమర్థంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. నీటి సంరక్షణ కార్యక్రమానికి మరింత విస్తృత ప్రజా భాగస్వామ్యం కల్పించే దిశగా ప్రజా ప్రతినిధుల ద్వారా ప్రజలకు నీటి పొదుపు, బాధ్యతాయుత వినియోగంపై సందేశం అందించేలా ప్రత్యేక ప్రజా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశాన్ని పరిశీలించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ, ప్రచార ప్రణాళిక, ప్రజలకు చేరవేయాల్సిన ముఖ్య సందేశాలతో సమగ్ర ప్రతిపాదన సిద్ధం చేయాలని ఆదేశించారు. నీటి వృథాను అరికట్టడం, అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును సమర్థంగా వినియోగించడం, ప్రజల భాగస్వామ్యంతో నీటి సంరక్షణను విస్తృత ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఎండీ స్పష్టం చేశారు.
ఫిల్లింగ్ స్టేషన్లను అవసరాలకు అనుగుణంగా విస్తరించాలి :
ప్రస్తుతం ఉన్న ఫిల్లింగ్ స్టేషన్ల సామర్థ్యం, ట్యాంకర్ల రాకపోకలు, రోజువారీ డిమాండ్, వేసవిలో పెరిగే అవసరాలను సమీక్షించి, అదనపు ఫిల్లింగ్ స్టేషన్లు అవసరమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించాలని ఎండీ ఆదేశించారు. ట్యాంకర్లు అనవసరంగా ఎక్కువ దూరం ప్రయాణించకుండా, నీటి అవసరం ఉన్న ప్రాంతాలకు సమీపంలో ఫిల్లింగ్ సదుపాయాలు అందుబాటులో ఉండేలా ఫిల్లింగ్ పాయింట్లను హేతుబద్ధీకరించాలని సూచించారు. కొత్త ఫిల్లింగ్ స్టేషన్లకు స్థలం, నీటి వనరు, మౌలిక సదుపాయాలు, అవసరమైన వ్యయం, అమలు గడువులతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
పవర్ బోర్‌వెల్స్‌కు స్పష్టమైన నిర్వహణ బాధ్యత :
ప్రస్తుతం పనిచేస్తున్న పవర్ బోర్‌వెల్స్‌లో ఒక్కోదానికి 15 రోజుల్లోగా ఒక లైన్మెన్ను ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని ఎండీ ఆదేశించారు. బోర్వెల్ ప్రదేశం, డివిజన్, ఇన్ఛార్జ్ వివరాలు, నీటి లభ్యత, ఆపరేటింగ్ సమయం, సరఫరా చేసే ప్రాంతం తదితర సమాచారంతో కేంద్రీకృత ఆన్లైన్ డేటాబేస్ రూపొందించాలని సూచించారు. ప్రతి బోర్వెల్కు అవసరాన్ని బట్టి ఆపరేషనల్ క్యాలెండర్ రూపొందించాలని, సాధారణ నీటి సరఫరా అందుబాటులో ఉన్నప్పుడు అనవసరంగా వినియోగించకుండా కాంటింజెన్సీ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. వీటి నిర్వహణ, పనితీరును సంబంధిత డీజీఎంలు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. పనిచేయని పవర్ బోర్‌వెల్స్‌లో వేసవి అవసరాలకు వాస్తవంగా ఉపయోగపడే వాటిని ప్రాంతాలవారీగా గుర్తించి, ప్రాధాన్య క్రమంలో పునరుద్ధరించాలని సూచించారు. ప్రత్యామ్నాయ జలవనరులు లేని, సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్న, అధిక కనెక్షన్లు కలిగిన ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చి, మరమ్మతులు, నెట్వర్క్ కనెక్టివిటీ, అంచనా వ్యయం, పూర్తి గడువులతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ట్రీటెడ్ వాటర్‌ను గృహేతర అవసరాలకు మళ్లించాలి :
తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన మురుగునీటిని ల్యాండ్‌స్కేపింగ్, పార్కులు, నిర్మాణ రంగం, సెంట్రల్ మీడియన్లు తదితర గృహేతర అవసరాలకు గరిష్ఠ స్థాయిలో వినియోగించాలని ఎండీ ఆదేశించారు. జలమండలి నిర్వహిస్తున్న ఎస్టీపీల వద్ద సాంకేతికంగా సాధ్యమైనచోట ట్రీటెడ్ వాటర్ ఫిల్లింగ్ పాయింట్లను ఏర్పాటు చేసి, అవసరాలకు అనుగుణంగా విస్తరించాలని సూచించారు. ప్రతి డివిజన్లో ట్రీటెడ్ వాటర్ ఎక్కడ అందుబాటులో ఉంది, సమీపంలో ఎక్కడ గృహేతర డిమాండ్ ఉంది, ఎంత పరిమాణం అవసరం, ట్యాంకర్ లేదా పైప్‌లైన్ ద్వారా ఎలా సరఫరా చేయవచ్చనే అంశాలతో సోర్స్–డిమాండ్ మ్యాపింగ్ చేపట్టాలని ఆదేశించారు.
ప్రైవేట్ ఎస్టీపీలను కూడా ట్రీటెడ్ వాటర్ వనరులుగా మ్యాపింగ్ చేయాలి :
జలమండలి ఎస్టీపీలతో పాటు నగరంలోని ప్రైవేట్ ఎస్టీపీలను కూడా ట్రీటెడ్ వాటర్ వనరులుగా పరిగణించాలని ఎండీ ఆదేశించారు. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్ సముదాయాలు, భారీ నివాస–వాణిజ్య ప్రాజెక్టుల్లోని ఎస్టీపీలపై సమగ్ర సర్వే చేపట్టి, వాటి ప్రదేశం, సామర్థ్యం, రోజువారీ ట్రీటెడ్ వాటర్ లభ్యత, నాణ్యత, ప్రస్తుత వినియోగం తదితర వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. నిర్ణీత గడువులో నమోదు చేసుకోని ప్రైవేట్ ఎస్టీపీల వివరాలను క్షేత్రస్థాయి అధికారులు సేకరించాలని, 15 రోజుల్లో ప్రాంతాలవారీగా సమగ్ర డేటాబేస్ సిద్ధం చేయాలని ఆదేశించారు. మొదటి దశలో ట్రీటెడ్ వాటర్ లభ్యతను మ్యాపింగ్ చేసి, రెండో దశలో సమీపంలోని గృహేతర వినియోగదారులు, డిమాండ్ కేంద్రాలను గుర్తించాలని సూచించారు. దూరం, సాంకేతిక సాధ్యాసాధ్యాలు, వ్యయాన్ని బట్టి ట్యాంకర్ల ద్వారా సరఫరా, పైప్‌లైన్ అనుసంధానం లేదా ఫిల్లింగ్ పాయింట్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రైవేట్ ఎస్టీపీల ట్రీటెడ్ వాటర్‌ను సమీపంలోని పార్కులు, ల్యాండ్‌స్కేపింగ్, సెంట్రల్ మీడియన్లు, ఓఆర్ఆర్ పరిసర గృహేతర అవసరాలకు వినియోగించే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. ట్రీటెడ్ వాటర్ మౌలిక సదుపాయాలు మంచినీటి సరఫరా వ్యవస్థతో కలవకుండా ప్రత్యేక గుర్తింపు, స్పష్టమైన విభజన ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
పారిశ్రామిక, బల్క్ సరఫరాపై ప్రభావాన్ని అంచనా వేయాలి :
పారిశ్రామిక, బల్క్ వినియోగదారులకు ప్రస్తుతం అందిస్తున్న నీటి పరిమాణం, సరఫరా విధానం, సంబంధిత జలవనరులను సమీక్షించాలని ఎండీ ఆదేశించారు. సింగూరు–మంజీరా కాంటింజెన్సీ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే ఆయా సరఫరాలపై పడే ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ప్రత్యామ్నాయ కార్యాచరణ సిద్ధం చేయాలని సూచించారు.
ప్రతిపాదనలు క్షేత్రస్థాయిలో అమలు చేయగలిగేలా ఉండాలి :
వేసవి సన్నద్ధతకు సంబంధించిన ప్రణాళికలు కేవలం ప్రతిపాదనలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు చేయగల స్పష్టమైన కార్యాచరణతో ఉండాలని ఎండీ అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి అంశానికి ప్రస్తుత పరిస్థితి, గుర్తించిన సమస్య, ప్రతిపాదిత పరిష్కారం, చేపట్టాల్సిన పని, అంచనా వ్యయం, అమలు గడువు, బాధ్యత వహించే అధికారుల వివరాలను నిర్దిష్టంగా పొందుపరచాలని ఆదేశించారు. సంబంధిత సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలు తమ పరిధిలోని క్షేత్రస్థాయి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించి, నిర్దిష్ట లక్ష్యాలు, కాలపరిమితులతో కూడిన ప్రాంతాలవారీ వేసవి కాంటింజెన్సీ కార్యాచరణను సిద్ధం చేసి అమలుకు సన్నద్ధంగా ఉండాలని ఎండీ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జలమండలి మల్కాజిగిరి ఈడీ పంకజ, ఆపరేషన్ డైరెక్టర్లు నారాయణ, సత్యనారాయణ, కిరణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ ప్రభు, సీజీఎంలు, జీఎంలు, డీజీఎంలతో పాటు ట్రాన్స్ మిషన్, ఐటీ విభాగపు అధికారులు పాల్గొన్నారు.