కురియన్ చొరవతో దిగివచ్చిన క్యాన్సర్ ఔషధం నెక్సావర్ ధర
కేరళ రాష్ట్ర మాజీ అదనపు ప్రధాన కార్యదర్శి, పేటెంట్ల మాజీ కంట్రోలర్ జనరల్ అయిన ఐఏఎస్ అధికారి పిహెచ్. కురియన్ క్యాన్సర్‌తో పోరాడుతూ 67 ఏళ్ల వయసులో ఆగస్టు 26, 2026న కన్నుమూశారు. ఆయన మార్చి 2012లో భారతదేశపు మొట్ట మొదటి నిర్బంధ లైసెన్సును జారీ చేశారు. ఇది బేయర్ యొక్క పేటెంట్ పొందిన క్యాన్సర్ ఔషధం నెక్సావర్ సరసమైన జెనరిక్ వెర్షన్‌ను తయారు చేయడానికి దేశీయ సంస్థ నాట్కో ఫార్మాకు అనుమతినిచ్చింది. 2012లో క్యాన్సర్ ఔషధం నెక్సావర్‌కు నాట్కో ఫార్మాకు తప్పనిసరి లైసెన్స్ మంజూరు చేయాలన్న ఆయన చారిత్రాత్మక నిర్ణయం, పేటెంట్ రక్షణను ప్రజారోగ్య అవసరాలతో సమతుల్యం చేయడంలో ఒక కీలక మలుపుగా నిలిచింది. ఇది భారతదేశ మేధో సంపత్తి పరిపాలనలో ఒక పరివర్తనాత్మక శకానికి నాంది పలికింది.

నింగి నుండి నేలకు దిగివచ్చిన నెక్సావర్ ధర :
అధునాతన మూత్రపిండ, కాలేయ క్యాన్సర్ల చికిత్స కోసం ఉద్దేశించిన సోరాఫెనిబ్ ( నెక్సావర్ పేరుతో విక్రయించబడింది ) అనే క్యాన్సర్ ఔషధాన్ని మొట్టమొదటగా జర్మనీకి చెందిన బేయర్ ఏజీ సంస్థ అభివృద్ధి చేసినందుకుగాను ఆ ఔషధంపై సర్వ హక్కులు ( పేటెంట్ ) కలిగి ఉండడంతో, తన గుత్తాధిపత్యాన్ని ప్రదర్శిస్తూ క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఒక నెలకు అవసరమయ్యే డోసు ధరను రు.2,80,000 రూపాయలకు పైగా నిర్ణయించింది. అయితే భారతదేశంలోని క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల కోసం ఈ ఔషధం జెనరిక్ వెర్షన్‌ను ( ఒక నిర్దిష్ట బ్రాండ్ పేరు లేకుండా, అసలు బ్రాండెడ్ మందులో ఉండే అదే రసాయన ఫార్ములా, మోతాదుతో తయారయ్యే చౌకైన మందులు ) అందుబాటులోకి తీసుకువచ్చేందుకు భారతదేశంలోని నాట్కో ఫార్మా, బేయర్ సంస్థ నుండి స్వచ్ఛంద వాణిజ్య లైసెన్స్‌ను కోరగా బేయర్ నిరాకరించింది. సరసమైన ధరకు ఆ మందు ప్రజలకు అందుబాటులో లేకపోవడం, తగినంత పరిమాణంలో లభ్యం కాకపోవడం వలన, భారత పేటెంట్ కార్యాలయం 2012 మార్చిలో భారత పేటెంట్ చట్టంలోని సెక్షన్ 84 కింద నాట్కో ఫార్మాకు భారతదేశపు మొట్టమొదటి నిర్బంధ లైసెన్స్‌ను ( కంపల్సరీ లైసెన్స్ ) మంజూరు చేసింది. ఈ లైసెన్స్ ప్రకారం, నాట్కో ఆ మందును స్థానికంగా ఉత్పత్తి చేసి, నెలకు సరిపడే ఒక డోసు మందు రు.8,880 రూపాయలకు మించకుండా విక్రయించడానికి అనుమతి లభించింది. తదనంతరం జరిగిన న్యాయ పోరాటాలలో, బేయర్ సంస్థ మేధో సంపత్తి అప్పీలేట్ బోర్డ్ ( IPAB ) న్యాయస్థానాల ద్వారా ఈ నిర్ణయంపై అప్పీల్ చేసింది. అయితే, భారత అధికారులు నాట్కో ఫార్మా సంస్థకు జారీ చేసిన నిర్బంధ లైసెన్సును ఒక పక్క సమర్థిస్తూనే, బేయర్‌కు రాయల్టీ చెల్లించాలని నాట్కో ఫార్మాను ఆదేశించారు. కురియన్, నాట్కో ఫార్మాకు అనుకూలంగా 68 పేజీల క్షుణ్ణమైన తీర్పును వెలువరించారు. ఆ ఔషధం ధర అధికంగా ఉందని, సరఫరా సరిపోవడం లేదని, భారతదేశంలో దాని ప్రభావం తగినంతగా లేదని ఆయన నిర్ధారించారు. ఆయన యొక్క ఈ నిర్ణయం నెలవారీ చికిత్స ఖర్చులను సుమారు 97 శాతం తగ్గించింది. దీనివల్ల, తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వేలాది మంది రోగులకు ప్రాణరక్షక ఔషధం అందుబాటులోకి వచ్చింది. కార్పొరేట్ కంపెనీల గుత్తాధిపత్యాల కంటే ప్రజారోగ్యానికి ప్రాధాన్యతనిచ్చేందుకు, మేధో సంపత్తి చట్టంలోని వెసులుబాట్లను ఉపయోగించుకోవడంలో ఈ తీర్పు ఒక కీలకమైన అంతర్జాతీయ ప్రమాణాన్ని నెలకొల్పింది.
మేధో సంపత్తి రంగంలో చేసిన కృషికి గుర్తింపు :
మేధో సంపత్తి రంగంలో కురియన్ చేసిన కృషి ఆయనకు విస్తృత గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది. 2009–10 సంవత్సరంలో, దేశంలోని అగ్రశ్రేణి పేటెంట్ అధికారిగా ఆయన చేసిన పని యొక్క ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తూ, మేధో సంపత్తి రంగంలోని 50 మంది అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా ఆయన గుర్తింపు పొందారు. పేటెంట్ పొందిన ఔషధం లభ్యత, అందుబాటు ధరలకు సంబంధించి ఆందోళనలు తలెత్తి సదరు ఔషధం పేటెంట్ చట్టం యొక్క నిబంధనల చట్రంలోకి వచ్చినప్పుడు, చట్టబద్ధమైన నిర్బంధ-లైసెన్సింగ్ యంత్రాంగాన్ని ఎలా ఉపయోగించవచ్చో నెక్సావర్ కేసు నిరూపించినందున, ఆ కేసులో ఆయన పాత్ర ప్రత్యేకంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
వ్యక్తిగతం, ఉద్యోగ ప్రస్థానం :
కొట్టాయం జిల్లాలోని పంపడిలో ఒక సాధారణ వ్యవసాయ కుటుంబంలో 1959 జనవరి 20న జన్మించిన పి.హెచ్. కురియన్ కేరళ విశ్వవిద్యాలయం నుంచి రసాయన శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. డాక్టరేట్ పరిశోధన కోసం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ( ఐఐఎస్‌సి) లో చేరిన ఆయన, సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులై ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లో చేరారు. ఆయన మొదట ఒడిశా కేడర్‌లో పనిచేసి, 1993లో కేరళ కేడర్‌కు మారారు. జాతీయ స్థాయిలో పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్ మార్కుల కంట్రోలర్ జనరల్‌గా కూడా పనిచేశారు. ఆయన భారతదేశ మేధో సంపత్తి విధానం ( india’s Intellectual Property Policy ) కోసం గణనీయమైన కృషి చేసిన ప్రముఖ భారతీయ అధికారిగా చరిత్రలో నిలిచిపోతారు. ఆయన కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద 2009 నుండి 2012 వరకు పేటెంట్లు, డిజైన్లు, ట్రేడ్ మార్కుల కంట్రోలర్ జనరల్‌గా పనిచేశారు. ఈ సమయంలో, పాత రికార్డులను డిజిటలైజ్ చేయడంలో, ఆన్‌లైన్ పేటెంట్ ఫైలింగ్ వ్యవస్థలను ప్రవేశపెట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఆయన కెరీర్‌లో రెవెన్యూ, పరిశ్రమలు, ఐటీ శాఖలలో ప్రిన్సిపల్ సెక్రటరీ వంటి కీలక పదవులు నిర్వహించారు. ఐటీ శాఖ ఉన్నతాధికారిగా టెక్నోపార్క్, ఇన్ఫోపార్క్, సైబర్‌పార్క్ వంటి కేరళలోని ప్రధాన టెక్నాలజీ హబ్‌ల అభివృద్ధి, విస్తరణలో అయన విశేష కృషి చేశారు. రాష్ట్ర స్టార్టప్ ఎకోసిస్టమ్, టెక్నాలజీ ఆధారిత వ్యవస్థాపకత, పౌరులకు టెక్నాలజీ, ప్రభుత్వ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి రూపొందించిన డిజిటల్ మౌలిక సదుపాయాలు, అక్షయ నెట్‌వర్క్ విస్తరణ ఆయన పదవీకాలంలోనే జరిగడం విశేషం. రెవెన్యూ కార్యదర్శిగా, ఓఖీ తుఫాను, 2018 నాటి వినాశకరమైన వరదలతో సహా ప్రధాన అత్యవసర పరిస్థితులలో అయన సమన్వయం మరువలేనిది. రెవెన్యూ, విపత్తు నిర్వహణలో ఆయనకున్న పరిపాలనా అనుభవం, అప్పటికే టెక్నాలజీ, పరిశ్రమ మరియు మేధో సంపత్తి రంగాలలో పనిచేసిన ఆయన వృత్తి జీవితానికి మరో ముఖ్యమైన కోణాన్ని జోడించింది అనడంలో సందేహం లేదు. ప్రతిపాదిత శబరిమల విమానాశ్రయం కోసం చెరువల్లి ఎస్టేట్‌లో భూమిని గుర్తించి, సేకరించే ప్రక్రియలో కూడా ఆయన ఎంతో చొరవ చూపారు. జనవరి 31, 2019న అదనపు ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వ సేవ నుండి పదవీ విరమణ పొందిన తరువాత ఆయన కేరళ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ( కె–రెరా ) ఛైర్మన్‌గా నియమితులై, నిబంధనల అమలు, పారదర్శకత, గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించడంపై దృష్టి సారిస్తూ, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ప్రమోటర్లు, ఏజెంట్ల నియంత్రణలో పాలుపంచుకున్నారు.
సామాజిక దృక్పథం :
కురియన్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అయిన స్వస్తి ఫౌండేషన్ యొక్క సలహా సంఘంలో కీలక సభ్యుడు, మార్గదర్శి, సలహాదారుగా ఉన్నారు. సలహా సంఘంలో కీలక సభ్యుడిగా ఆయన ముఖ్యంగా దాని వివిధ సామాజిక, పర్యావరణ కార్యక్రమాలకు మార్గనిర్దేశం, సలహా, మద్దతును అందించేవారు. ఆయన మాజీ డీజీపీ జాకబ్ పున్నూస్ వంటి ఇతర ప్రముఖ నాయకులు, పోషకులతో ( ప్యాట్రన్స్ ) పాటు, తిరువనంతపురంలో ప్రారంభించిన ‘ అశ్వాసం ’ ఉచిత ఆరోగ్య సంరక్షణ వంటి ప్రధాన కార్యక్రమాలలో పాల్గొన్నారు. “ రివైవ్ వెల్లయాని ” సరస్సు పరిరక్షణ కార్యక్రమం వంటి పర్యావరణ, సరస్సుల ప్రక్షాళన కార్యక్రమాలతో సహా, ఫౌండేషన్ నిర్వహించిన లేదా ప్రముఖంగా ప్రస్తావించిన సామాజిక కార్యక్రమాలకు ఆయన తన వంతు మద్దతు అందించారు. ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న సంగీతకారులు, కళాకారులకు చేయూతనందించేందుకు సంస్థ స్థాపించిన స్వస్తి స్కూల్ ఆఫ్ మ్యూజిక్ వంటి కీలక కార్యక్రమాలలో ఆయన భాగస్వామ్యం ప్రముఖంగా ప్రస్తావించదగినది. స్వస్థి ఫౌండేషన్ సభ్యుడిగా వ్యాధి నివారణ, సమాజ ఆరోగ్యం పట్ల ఆయన ప్రదర్శించిన కార్యశీలత, నిబద్ధతతో పాటు పాటించిన విలువలు అతనితో పాటు పనిచేసిన వారికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి.

![]()
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png