Addam News
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 4:12 am Posted by : Addam News

ఉద్యమకారుల ఎఫ్‌ఐఆర్‌ రికార్డుల డేటాను అందించాలి

ఉద్యమకారుల ఎఫ్‌ఐఆర్‌ రికార్డుల డేటాను అందించాలి
– డీజీపీకి తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ వినతి

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 15, ( అద్దం న్యూస్ ) :   తెలంగాణ ఉద్య‌మంలో పాల్గొన్న‌ ఉద్యమకారుల ఎఫ్‌ఐఆర్‌ రికార్డుల డేటాను అందించాలని తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ లు రాష్ట్ర డిజిపి సివి.ఆనంద్‌ను కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన వివిధ దశల పోరాటాల్లో అక్రమ కేసులు, అరెస్టులు, జైలు శిక్షలు ఎదుర్కొన్న ఉద్యమకారుల వివరాలను సమగ్రంగా సేకరించే ప్రక్రియలో భాగంగా డీజీపీ సివి.ఆనంద్ ను ఆయ‌న‌ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ లు మంగ‌ళ‌వారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్వరాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, కేసుల వివరాలు, అరెస్టులు, రిమాండ్‌, జైలు శిక్షలకు సంబంధించిన పోలీసు రికార్డులు, అందుబాటులో ఉన్న డేటాను కమిటీకి అందజేయాలని వారు డీజీపీని కోరారు. ఉద్యమంలో పాల్గొన్న నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు పోలీసు శాఖ వద్ద ఉన్న అధికారిక రికార్డులు ఎంతో కీలకమని వారు వివరించారు.

ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాలను గుర్తించి వారికి తగిన గౌరవం, గుర్తింపు కల్పించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ప్రక్రియలో భాగంగా సంబంధిత రికార్డుల సేకరణ అవసరమని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ సివి.ఆనంద్ స్పందిస్తూ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియకు పోలీసు శాఖ తరఫున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేసినట్లు తెలిపారు. సంబంధిత రికార్డుల సేకరణకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులకు సూచనలు చేస్తామని డీజీపీ హామీ ఇచ్చినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల చరిత్ర, వారి త్యాగాలు అధికారిక రికార్డుల్లో ప్రతిబింబించేలా చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు ఉద్యమ చరిత్రను సజీవంగా అందించవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png