Addam News
Newspaper Banner
Date of Publish : 14 November 2026, 9:25 am Posted by : Addam News

నిర్మాణ రంగంలోనూ శుద్ధి జలాల వినియోగానికి శ్రీకారం

 ఎంఎంసీ పరిధిలో తొలిసారిగా నిర్మాణ పనులకు ఎస్‌టిపి శుద్ధి జలాలు
# గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించిన ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి
# స్వచ్ఛందంగా ముందుకొచ్చిన తొలి నిర్మాణ సంస్థ వాసవి గ్రూప్
# మూడు ఎస్‌టిపిల నుంచి రోజుకు 56 లక్షల లీటర్ల శుద్ధి జలాలు అందుబాటులోకి
• నిర్మాణ పనులకు తాగునీరు, భూగర్భ జలాలకు బదులుగా శుద్ధి జలాలనే వినియోగించాలి

హైద‌రాబాద్‌, ( అద్దం న్యూస్ ) :    హైదరాబాద్ మహానగరంలో తాగునీటి సంరక్షణ, శుద్ధి జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించేందుకు జలమండలి చేపట్టిన డయల్-ఎ-గ్రీన్ ట్యాంకర్ కార్యక్రమం నిర్మాణ రంగానికి విస్తరించింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ( ఎంఎంసీ ) పరిధిలో తొలిసారిగా నిర్మాణ పనులకు ఎస్‌టిపిల్లో తృతీయ దశలో శుద్ధి చేసిన నీటిని వినియోగించే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. వాసవి ఆనంద నిలయం నిర్మాణ ప్రాంగణంలో ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి గ్రీన్ వాటర్ ట్యాంకర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా శుద్ధి జలాలను వినియోగించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన తొలి నిర్మాణ సంస్థగా వాసవి గ్రూప్ నిలిచింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ… రాబోయే వేసవిలో నీటి కొరతను దృష్టిలో ఉంచుకుని నిర్మాణ పనులకు తాగునీరు, భూగర్భ జలాలకు బదులుగా టెర్షియరీ శుద్ధి జలాలను వినియోగించాలని సూచించారు. అన్ని నిర్మాణ సంస్థలు ఈ నిబంధనలను పాటించేలా చర్యలు చేపట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ముందుకొచ్చిన వాసవి గ్రూప్‌ను అభినందించారు. జలమండలి మల్కాజిగిరి రీజియన్ ఈడీ ఎస్.పంకజ మాట్లాడుతూ… నిర్మాణ ప్రాంగణాల్లో కాంక్రీట్ క్యూరింగ్, దుమ్ము నియంత్రణ, శుభ్రపరిచే పనులకు మాత్రమే శుద్ధి జలాలను వినియోగించాలని సూచించారు. శుద్ధి జలాల వినియోగాన్ని పర్యవేక్షించేందుకు ఎంఎంసీ ఏసీపీలు, జలమండలి డీజీఎంలతో సంయుక్త బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

మూడు ఎస్‌టిపిల నుంచి 56 లక్షల లీటర్లు :
ఎంఎంసీ పరిధిలోని సరూర్‌నగర్ ( 2.50 ఎంఎల్‌డీ ), పటేల్ చెరువు ( 2.50 ఎంఎల్‌డీ ), సఫిల్‌గూడ ( 0.60 ఎంఎల్‌డీ ) ఎస్‌టిపి ల నుంచి రోజుకు మొత్తం 5.60 ఎంఎల్‌డీ ( 56 లక్షల లీటర్లు ) టెర్షియరీ శుద్ధి జలాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ నీటిని జలమండలి ఉచితంగా అందిస్తుందని, వినియోగదారులు రవాణా ఖర్చులు మాత్రమే భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. నిర్మాణ సంస్థలు తమ సొంత ట్యాంకర్లను గ్రీన్ వాటర్ ట్యాంకర్లుగా నమోదు చేసుకోవచ్చని, లేదంటే డయల్-ఎ-గ్రీన్ ట్యాంకర్ ద్వారా బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వివరాలకు 155313 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి ఈడీ పంకజ, డైరెక్టర్ బి.నారాయణ, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో, ఎంఎంసీ, జలమండలి అధికారులు, వాసవి గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.