Addam News
Newspaper Banner
Date of Publish : 03 January 2026, 7:07 am Posted by : Addam News

ఈ సారి టీ20 ప్రపంచకప్‌ను ఎవడూ చూడడు: అశ్విన్

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ఐసీసీపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించాడు. ఐసీసీ అనాలోచిత నిర్ణయం ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి తీరని నష్టం చేయనుందన్నాడు. ఈ మెగా టోర్నీని ఎవడూ చూడడని తెలిపాడు. వ్యూయర్‌షిప్ దారుణంగా పడిపోనుందని హెచ్చరించాడు. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 8 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికగా టీ20 ప్రపంచకప్ జరగనుంది. తాజాగా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా ఈ టోర్నీ షెడ్యూల్ గురించి మాట్లాడిన అశ్విన్.. ఐసీసీపై విమర్శలు గుప్పించాడు. గ్రూప్ స్టేజ్‌లో భారత్ మ్యాచ్‌లను అసోసియేట్ దేశాలతో షెడ్యూల్ చేయడాన్ని అశ్విన్ తప్పుబట్టాడు. మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగి ఈ మెగా టోర్నీపై అభిమానుల ఆసక్తి కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించాడు.

‘ఈ సారి ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీని ఎవరూ చూడరు. ఇండియా వర్సెస్ యూఎస్ఏ, ఇండియా వర్సెస్ నమీబియా.. ఇవన్నీ ప్రపంచకప్‌కు అభిమానులను దూరం చేసే మ్యాచ్‌లు. ఒకప్పుడు ప్రపంచకప్‌లు నాలుగేళ్లకు ఒకసారి జరిగేవి. దానివల్ల ఆ టోర్నీపై సహజంగానే ఆసక్తి పెరిగేది. అప్పట్లో తొలి రౌండ్‌లో భారత జట్టు.. ఇంగ్లండ్, శ్రీలంక వంటి పటిష్టమైన జట్లతో తలపడేది. ఆ మ్యాచ్‌లు కూడా సరదాగా ఉండేవి.

నేను స్కూల్‌లో ఉన్నప్పుడు.. 1996, 1999, 2003 వన్డే ప్రపంచకప్‌లు నాలుగేళ్లకు ఒకసారి జరిగాయి. మేం ప్రపంచకప్ కార్డ్స్ సేకరించి ఆడుకునేవాళ్లం. మ్యాచ్‌ల షెడ్యూల్స్ ప్రింట్ తీసుకోవడం, న్యూస్ పేపర్ కట్టింగ్స్‌ను తీసి దాచుకునేవాళ్లం. ప్రపంచకప్ మ్యాచ్‌ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసేవాళ్లం. ఆ నిరీక్షణ మ్యాచ్‌లపై మరింత ఆసక్తిని పెంచేది.’అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 నుంచి 20 జట్లు బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. దాంతో 20 జట్లను ఐదు గ్రూప్‌లు విభజించి లీగ్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. 2014, 2016, 2021, 2022 టోర్నీల్లో మాత్రం టాప్ ర్యాంక్ దేశాలు నేరుగా సూపర్ 10/12 ఆడేవి. మిగతా అసోసియే దేశాలు గ్రూప్ స్టేజి ఆడి వచ్చేవి. కోవిడ్ కారణంగా 2020లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ 2021కి వాయిదా పడింది. మిగతా టోర్నీలన్నీ రెండేళ్లకు ఒకసారి జరిగింది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png