Addam News
Newspaper Banner
Date of Publish : 25 March 2026, 10:24 am Posted by : Addam News

కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం పై దాడి, వ్యక్తి అరెస్ట్

కల్తీ పచ్చళ్ల తయారీ కేంద్రం పై దాడి  
–  వ్యక్తి అరెస్ట్, రూ. 3 ల‌క్ష‌ల విలువైన నిల్వలు స్వాధీనం

జియాగూడ, మార్చి 24, అద్దం న్యూస్ :   హైదరాబాద్ సిటీ కమిషనర్స్ టాస్క్ ఫోర్స్ ( గోల్కొండ టీమ్ ), కుల్సుంపురా పోలీసులు సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో జియాగూడలోని వెంకటేష్‌న‌గ‌ర్‌లో ఎటువంటి అనుమతులు లేకుండా అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో పచ్చళ్లు తయారు చేస్తున్న కేంద్రాన్ని గుర్తించారు. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యాపారం చేస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి, భారీ మొత్తంలో కల్తీ పచ్చళ్లను సీజ్ చేశారు. అధికారులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలిలా ఉన్నాయి… జియాగూడ‌కు చెందిన కె.ర‌వీంద‌ర్ ( 62 ) ప‌చ్చ‌ళ్ల వ్యాపారం చేస్తుంటాడు. ఎటువంటి చట్టబద్ధమైన లైసెన్స్ లేకుండా, నాణ్యత లేని ముడి పదార్థాలతో, అపరిశుభ్ర వాతావరణంలో వివిధ రకాల పచ్చళ్లను తయారు చేస్తున్నాడు. కుళ్లిపోయిన మామిడికాయలు, నిమ్మకాయలను రాళ్ల ఉప్పుతో నిల్వ చేసి, వాటిని పచ్చళ్లలో ఉపయోగిస్తున్నాడు.

ఈ ప్రమాదకరమైన ఉత్పత్తులను వివిధ కిరాణా షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తూ, ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు కమిషనర్స్ టాస్క్ ఫోర్స్, కుల్సుంపురా పోలీసులు దాడి నిర్వహించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కుల్సుంపురా పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై Cr.No. 90/2026 U/sec 318 ( 1 ), 274, 275 BNS కింద కేసు నమోదు చేశారు. ఆయ‌న వ‌ద్ద అపరిశుభ్రమైన ఎర్ర మిర్చి పచ్చడి 15 డ్రమ్ములు ( 2400 కేజీలు ), 2 డ్రమ్ముల్లో 320 కేజీల ఉసిరి పచ్చడి, 10 డ్రమ్ముల్లో 1600 కేజీల టమాటా పచ్చడి, 3 డ్రమ్ముల్లో 480 కేజీల నిమ్మకాయ పచ్చడి, 13 డ్రమ్ముల్లో 2080 కేజీల రాళ్ల ఉప్పుతో నిల్వ చేసిన మామిడి ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. 3 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన ప‌చ్చ‌ళ్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ టాస్క్ ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు మార్గదర్శకత్వంలో గోల్కొండ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఆర్.వెంకటేష్, కుల్సుంపురా ఇన్‌స్పెక్టర్ ఎ.రాములు, ఎస్ఐ లు కె. వెంకటరమణ, కె.శ్వేత, సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png