న్యూయార్క్, అక్టోబర్ 12, ( అద్దం న్యూస్ ) : న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ( UNGA ) రెండవ కమిటీ ‘ స్థూల ఆర్థిక విధాన ప్రశ్నలు, అభివృద్ధికి ఆర్థిక సహాయం ‘ అనే అంశంపై జరిగిన సంయుక్త చర్చలో భారతదేశం తరపున రాజ్యసభ సభ్యుడు మందాడి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటనను సమర్పించారు. ఈ అంతర్జాతీయ సభను ఉద్దేశించి ఎంపి అనిల్ కుమార్ యాదవ్ ప్రసంగిస్తూ, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను కాపాడి, ఆహార భద్రతను పరిరక్షించే నిష్పక్షపాతమైన, పారదర్శకమైన మరియు నియమాల ఆధారిత ప్రపంచ వాణిజ్య వ్యవస్థ యొక్క ఆవశ్యకతను మందాడి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. అందుబాటు ధరలో అభివృద్ధి ఆర్థిక సహాయం, నిష్పక్షపాతమైన క్రెడిట్ రేటింగ్లు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు అధిక ప్రాతినిధ్యం కల్పించడం యొక్క ప్రాముఖ్యతను ఆయన ఉద్ఘాటించారు. రుణ నిర్వహణ, అక్రమ ఆర్థిక ప్రవాహాలను అరికట్టడం, నిష్పక్షపాతమైన, సమర్థవంతమైన పన్నుల విధానాన్ని ప్రోత్సహించడం వంటి అంశాలలో బలమైన అంతర్జాతీయ సహకారం అవసరమని ఆయన చెప్పారు. డిజిటల్ పరివర్తనలో భారతదేశం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, ఆర్థిక సమ్మిళితత్వాన్ని పెంపొందించడానికి, ప్రజా సేవల పంపిణీని మెరుగుపరచడానికి, ప్రభుత్వ వ్యయ సామర్థ్యాన్ని పెంచడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వినియోగించుకోవడంలో దేశానికి ఉన్న అనుభవం గురించి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడారు.
బహుపాక్షిక సహకారానికి భారతదేశం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ నిబద్ధతలు ప్రజలకు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల వారికి స్పష్టమైన ప్రయోజనాలుగా మారాలని ఆయన నొక్కి చెప్పారు. సమ్మిళిత, సమానమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, సుస్థిర అభివృద్ధి, ఉమ్మడి శ్రేయస్సు పట్ల భారతదేశానికి ఉన్న నిరంతర నిబద్ధతను మందాడి అనిల్ కుమార్ యాదవ్ ప్రసంగం ప్రతిబింబించింది. ప్రపంచ ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడంలో, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో నిర్మాణాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను ఆయన వివరించారు. నిష్పక్షపాతమైన ప్రపంచ వాణిజ్యం, అందుబాటు ధరలో అభివృద్ధి ఆర్థిక సహాయం, బలమైన అంతర్జాతీయ సహకారం కోసం ఆయన పిలుపునిచ్చారు.