Addam News
Newspaper Banner
Date of Publish : 05 November 2026, 2:56 am Posted by : Addam News

షెడ్యూల్ కంటే 6 గంటల ముందుగానే గండిపేట కాండ్యూట్ మరమ్మతు పనులు పూర్తి

 105 ఏళ్ల పురాతన కాండ్యూట్‌లో భారీ లీకేజీలకు అడ్డుకట్ట
# 8 కీలక ప్రాంతాల్లో 90 శాతానికి పైగా లీకేజీల నియంత్రణ
# ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి వృథాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు
# ప్రభావిత ప్రాంతాలకు దశలవారీగా తాగునీటి సరఫరా పునరుద్ధరణ

గండిపేట, న‌వంబ‌ర్ 4, ( అద్దం న్యూస్ ) :   హైదరాబాద్ నగరానికి ఉస్మాన్‌సాగర్ ( గండిపేట ) జలాశయం నుంచి ముడినీటిని సరఫరా చేసే ప్రధాన కాండ్యూట్‌లో భారీ లీకేజీలను అరికట్టేందుకు చేపట్టిన మరమ్మతు పనులను జలమండలి విజయవంతంగా పూర్తి చేసింది. నిర్ణీత గడువు కంటే 6 గంటల ముందుగానే పనులు పూర్తి చేసి నీటి సరఫరా పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించింది. సుమారు 105 ఏళ్లకు పైగా నగరానికి సేవలందిస్తున్న ఈ పురాతన రాతి నిర్మాణ కాండ్యూట్‌లో కాలక్రమేణా రాతి కట్టడాలు, వాటి మధ్య జాయింట్లు దెబ్బతినడంతో పలుచోట్ల భారీ లీకేజీలు ఏర్పడ్డాయి. వీటిని పూర్తిస్థాయిలో నివారించేందుకు కాండ్యూట్ పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉండగా, అందుకు కొన్ని నెలల సమయం అవసరమవుతుంది. అయితే, రాబోయే ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి లభ్యతపై సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉన్నందున, నీటి సరఫరాలో నష్టాలను తగ్గించేందుకు జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో జలమండలి ఎండీ కె.అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు కాండ్యూట్‌లో లీకేజీలు అధికంగా ఉన్న 8 కీలక ప్రాంతాలను గుర్తించారు. వాటి మరమ్మతుల కోసం ఈ నెల 3 వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 36 గంటల పాటు షట్‌డౌన్ చేపట్టారు.

సబ్జా కాలనీ, జానకీ నగర్, టోలిచౌకి, మణికొండ, గండిపేట ప్రాంతాల్లో చేపట్టిన మరమ్మతు పనులను అధికారులు, సిబ్బంది సమన్వయంతో వేగంగా పూర్తి చేశారు. పరిమిత సమయంలోనే గుర్తించిన ప్రాంతాల్లో 90 శాతానికి పైగా దీర్ఘకాలిక లీకేజీలను అరికట్టి, నీటి వృథాను గణనీయంగా తగ్గించేలా చర్యలు తీసుకున్నారు. మరమ్మతు పనులు పూర్తయిన నేపథ్యంలో డివిజన్ XIII, XIV, XV, XVII పరిధిలోని ప్రభావిత ప్రాంతాలకు పంపింగ్, నీటి పంపిణీని దశలవారీగా పునరుద్ధరిస్తున్నారు. ఈ సమయంలో తాగునీటి సరఫరాలో ఏర్పడిన అంతరాయాన్ని అర్థం చేసుకుని సహకరించిన నగర ప్రజలకు జలమండలి కృతజ్ఞతలు తెలిపింది.