Addam News
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 2:28 am Posted by : Addam News

రూ. 500 కోట్ల ఆయిల్ ఫెడ్ భూమిని రూ. 80 కోట్లకే ప్రైవేట్ పరం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ – బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్‌.దాసోజు శ్రవణ్

పామాయిల్ రైతుల పొట్ట కొట్టి, రియల్ ఎస్టేట్ గద్దలకు విందు !
రూ. 500 కోట్ల ఆయిల్ ఫెడ్ భూమిని రూ. 80 కోట్లకే ప్రైవేట్ పరం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్
జీవో 85 రద్దయ్యే వరకు అసెంబ్లీ, మండలి, పార్లమెంట్, కోర్టుల్లో పోరాటం
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్‌. దాసోజు శ్రవణ్

హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 28, ( అద్దం న్యూస్ ) :    పామాయిల్ రైతుల పొట్ట కొట్టి, రియల్ ఎస్టేట్ గద్దలకు విందుగా మార్చుకున్నాని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్‌.శ్రవణ్ దాసోజు అన్నారు. రూ.500 కోట్ల విలువైన‌ ఆయిల్ ఫెడ్ భూమిని రూ. 80 కోట్లకే రేవంత్ రెడ్డి సర్కార్ ప్రైవేట్ పరం చేస్తుంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. జీవో 85 రద్దయ్యే వరకు అసెంబ్లీ, మండలి, పార్లమెంట్, కోర్టుల్లో పోరాటం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రైతుల ఆస్తిని రియల్ ఎస్టేట్ దందాలకు తాకట్టు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్ట‌ర్‌.శ్రవణ్ దాసోజు బట్టబయలు చేశారు. హైద‌రాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వ‌ద్ద గ‌ల‌ ఆయిల్ ఫెడ్ భూములు, పామాయిల్ స్టాక్ పాయింట్‌ను అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ముఠా జై సింహ, ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ రామకృష్ణ రెడ్డి, ఆయిల్ ఫెడ్ ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమా మహేశ్వర్ రెడ్డి, కార్యదర్శి పుల్లయ్య, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ తదితరులతో కలిసి పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో దాసోజు శ్ర‌వ‌ణ్ మాట్లాడుతూ… కేసీఆర్ దార్శనికత, రామకృష్ణ రెడ్డి నాయకత్వంలో పామాయిల్ సాగు 2.5 లక్షల ఎకరాలకు విస్తరించిందన్నారు. మిషన్ కాకతీయ, చెక్ డ్యామ్‌లు, రైతులకు ప్రోత్సాహకాలతో తెలంగాణ ఆయిల్ ఫెడ్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అధికారం నుంచి దిగిపోయేనాటికి ఆయిల్ ఫెడ్ ఖజానాలో రూ.370 కోట్ల మిగులు ఉందని, కేసీఆర్ రైతులకు సంపద సృష్టిస్తే, రేవంత్ రెడ్డి ఆ సంపదను రియల్ ఎస్టేట్ మిత్రులకు పంచిపెడుతున్నారని విమ‌ర్శించారు. చంద్రబాబు ప్రారంభించిన కుట్రను రేవంత్ రెడ్డి పూర్తి చేస్తున్నారని… సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను, కేసీఆర్ ప్రభుత్వ నోటీసులను తుంగలో తొక్కి, మే 22, 2026న జీవో ఎంఎస్ నెం.85ను తెచ్చారన్నారు. వివాదాస్పద జీవో 366 ను ఆధారంగా చేసుకుని, మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న సుమారు 17,000 గజాల భూమిని ( గజం రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల విలువ ) ప్రైవేట్ వ్యక్తుల పరం చేస్తున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఈ భూమి పక్కనే ఉన్న 14 ఎకరాల్లో ‘సత్వ’ సంస్థ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు నిర్మిస్తుండగా, ‘ఏబీఎల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్’ 50 అంతస్తుల మూడు టవర్లలో సుమారు 1,500 ఫ్లాట్లను చదరపు అడుగు రూ.10,000 చొప్పున విక్రయిస్తోందన్న వార్తలు వస్తున్నాయని.. ఆయిల్ ఫెడ్ భూమిపై కన్నేసింది ఎవరి కోసం ? దాసోజు శ్ర‌వ‌ణ్ ప్ర‌శ్నించారు. ముఖ్యమంత్రి సోదరులు సైతం ఈ ప్రాంతానికి వచ్చి, వేల కోట్ల రియల్ ఎస్టేట్ అవకాశాలపై రెక్కీ నిర్వహించారన్న ప్రచారం జరుగుతోందని, ఇందులో నిజమెంత ? ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. ఏడు దశాబ్దాల చరిత్ర, ఒకే తీర్పు, ఆ భూమి ప్రభుత్వానిదే అని శ్ర‌వ‌ణ్ స్ప‌ష్టం చేశారు. 1954లో అజామాబాద్ పారిశ్రామిక వాడలో దయారామ్ సూరజ్‌మల్ లాహోటి ఆయిల్ మిల్స్‌కు 17,261 గజాల భూమి కేటాయించార‌ని, 1974 మార్చి 20న ఆయిల్ ఉత్పత్తి చేయకుండా, లక్ష్యాన్ని గాలికొదిలి భూమిని ప్రైవేట్ వ్యక్తులకు సబ్ లీజులకు ఇవ్వడంతో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ద్వారా లీజు రద్దు చేశార‌న్నారు. ఆ త‌ర్వాత 1987 అక్టోబ‌ర్ 2వ తేదీన లాహోటి న్యాయపోరాటాన్ని తిరస్కరిస్తూ, ఆ భూమి ప్రభుత్వానిదేనని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింద‌న్నారు. 1990 లో సుప్రీంకోర్టు తీర్పు మేరకు జీవో ఎంఎస్ నెం.93 ద్వారా 15,983 గజాల భూమి ఆయిల్ ఫెడ్‌కు బదిలీ చేశార‌ని, దిగువ కోర్టులు కూడా ఈ భూమి ఆయిల్ ఫెడ్‌దేనని తేల్చాయన్నారు. 2002 లో స్టేటస్‌కో ఉత్తర్వులను అడ్డుపెట్టుకుని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెం.366 ద్వారా పాత లీజును పునరుద్ధరించే దొడ్డిదారి ప్రయత్నం చేశారని తెలిపారు. 2014 తర్వాత కేసీఆర్ ప్రభుత్వం జీవో 366ను ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ నోటీసులు జారీ చేసి, ఆయిల్ ఫెడ్ భూములను కాపాడ‌డం జ‌రిగింద‌న్నారు.

మొక్కలు ఇవ్వలేరు, మిల్లులు కట్టలేరు, భూములు మాత్రం అమ్మేస్తారన్నాని ధ్వ‌జ‌మెత్తారు. లక్షలాది ఎకరాల్లో పామాయిల్ సాగుకు రైతులు సిద్ధంగా ఉన్నా, వారికి మొక్కలు సరఫరా చేసే స్థితిలో ప్రభుత్వం లేదు. ఆయిల్ ఫెడ్ కింద ఇంకా మూడు మిల్లులు నిర్మించాల్సి ఉండగా, వాటిని గాలికొదిలి ప్రభుత్వ ఆస్తులను రియల్ ఎస్టేట్ దందాలకు అప్పగిస్తున్నారన్నారు. రూ.8,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం రూ.87 కోట్లకు ప్రైవేట్ వ్యక్తులకు ఎలా కట్టబెడతారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు లేఖ రాసి నిలదీసినా, ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు. ఈ కేటాయింపు వెనుక ఉన్న లబ్ధిదారులు ఎవరో, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పాత్ర ఏమిటో ప్రభుత్వం బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు పామాయిల్ సాగు కేవలం 30,000 ఎకరాలకే పరిమితమై, 30,000 నుంచి 45,000 టన్నుల ఉత్పత్తితో ఈ రంగం కుప్పకూలే దశలో ఉందని.. సొంత మిల్లు కట్టుకోవడానికి కూడా డబ్బుల్లేని ఆయిల్ ఫెడ్‌కు 2014 లో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.10 కోట్ల గ్రాంటు ఇచ్చి, నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు నిధులతో అశ్వారావుపేటలో మిల్లు ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం నైతికత ఉన్నా ఈ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని డా. శ్రవణ్ దాసోజు డిమాండ్ చేశారు. ఆయిల్ ఫెడ్ భూములను కట్టబెట్టే జీవో నెం.85 ను, దానికి పునాదైన జీవో 366ను వెంటనే బేషరతుగా రద్దు చేయాలన్నారు. ఆయిల్ ఫెడ్ భూమిని శాశ్వతంగా ఆయిల్ ఫెడ్ పేరిటే ఉంచి, రైతుల అవసరాలకే వినియోగించాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు ముచ్చ‌కుర్తి ప్ర‌భాక‌ర్‌, రేషం మ‌ల్లేష్‌, సిరిగిరి శ్యామ్‌, కొండ శ్రీధ‌ర్ రెడ్డి, క‌ల్వ‌గోపి, శ్రీధ‌ర్‌రెడ్డి, ఆకుల అరుణ్‌, గోక న‌వీన్‌, ఎయిర్‌టెల్ రాజు, క‌రికె కిర‌ణ్ కుమార్‌, శంక‌ర్ ముదిరాజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.