ప్రజా పాలన ప్రభుత్వంలో 1000 రోజుల్లో రవాణా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు

ప్రజా పాలన ప్రభుత్వంలో 1000 రోజుల్లో రవాణా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు
మహిళా సాధికారత, ఉద్యోగ సంక్షేమం, ఆధునిక ప్రజా రవాణాకు పెద్దపీట
2,932 కొత్త బస్సుల కొనుగోలు.. 1,024 ఎలక్ట్రిక్ బస్సుల సేవలు
హైదరాబాద్‌లో మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులు త్వరలో రోడ్డెక్కనున్నాయి
ఆర్టీసీని దేశంలోనే నంబర్‌–1గా నిలిపేందుకు కృషి
విజన్ 2047 కి అనుగుణంగా ఆర్టీసీ మరింత ముందుకు పోతున్నాం
» మంత్రి పొన్నం ప్రభాకర్

హైద‌రాబాద్ బ్యూరో, సెప్టెంబ‌ర్ 1, ( అద్దం న్యూస్ ) :  ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వం 1000 రోజుల పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రవాణా శాఖ, టీజీఎస్ ఆర్టీసీలో అనేక విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం హైద‌రాబాద్‌ బస్ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో రవాణా శాఖ, ఆర్టీసీ ప్రగతిని వివరించారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, ఆధునిక ప్రజా రవాణా అందించడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 347.36 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారని, తద్వారా మహిళలు సుమారు రూ.12,167 కోట్లు ఆదా చేసుకున్నారని చెప్పారు. ఈ పథకం వల్ల మహిళల ఆర్థిక సాధికారత పెరిగిందని, కుటుంబ ఆర్థిక వ్యవస్థకు మహిళలు మరింత అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం అమలుకు ముందు ఆర్టీసీ ఆక్యుపెన్సీ సుమారు 67 శాతం ఉండగా, ప్రస్తుతం 89 శాతానికి పెరిగిందని మంత్రి తెలిపారు. మహిళలను కేవలం ప్రయాణికులుగా కాకుండా రవాణా రంగంలో యజమానులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా SERP/ మహిళా సంఘాల ద్వారా 600 బస్సులను కొనుగోలు చేయించి వాటి నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించామని మంత్రి తెలిపారు. ప్రతి బస్సుకు నెలకు సుమారు రూ.69,468 చొప్పున EMI చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు సుమారు రూ.29.31 కోట్లు చెల్లించామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తార్నాక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు. ప్రజా ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి వారు సూచించిన కొత్త రూట్లలో బస్సు సర్వీసులను ప్రారంభిస్తున్నామని మంత్రి తెలిపారు. హైదరాబాద్ నగరంలో 370 కొత్త రూట్లలో బస్సు సర్వీసులు నడుపుతున్నామని, గ్రామాల్లో కూడా ఇప్పటివరకు బస్సు సౌకర్యం లేని ప్రాంతాలకు సర్వీసులను విస్తరిస్తున్నామని చెప్పారు. ఎంఎంటీఎస్, మెట్రో రైలు, ఆర్టీసీ సమన్వయంతో లాస్ట్ మైల్ కనెక్టివిటీ మరింత మెరుగుపరుస్తామని తెలిపారు. టికెటింగ్‌లో ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషీన్ల వినియోగాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా బస్ స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. పెద్దపల్లి, ఏటూరునాగారం ప్రాంతాల్లో కొత్త డిపోలను ఏర్పాటు చేశామని, రాబోయే గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని బస్ స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతామని చెప్పారు. మేడారం జాతరకు కూడా విజయవంతంగా ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించామని తెలిపారు.

ఆర్టీసీలో 2,932 కొత్త బస్సులు :
ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2,932 కొత్త బస్సులను కొనుగోలు చేశామని మంత్రి తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,024 ఎలక్ట్రిక్ బస్సులు విజయవంతంగా నడుస్తున్నాయని, హైదరాబాద్ నగరంలో త్వరలో మరో 2,200 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్డెక్కించనున్నామని చెప్పారు. PM E-DRIVE కార్యక్రమం కింద హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతున్నామని, ఇప్పటికే 240 డీజిల్ బస్సులను రెట్రోఫిట్ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల విధానాన్ని అమలు చేస్తూ సుమారు రూ.1,400 కోట్ల మేర పన్ను మినహాయింపులు కల్పించామని మంత్రి వెల్లడించారు.

ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత :
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 4,538 ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టామని, అందులో 1,000 డ్రైవర్, 743 శ్రామిక పోస్టుల నియామక ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. అలాగే 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు. నియామకాల్లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పోలీస్ శాఖ ద్వారా పారదర్శకంగా ప్రక్రియ చేపట్టామని చెప్పారు. గతంలో సర్వీసు నుంచి తొలగించబడిన సుమారు 244 మంది ఉద్యోగులను ప్రత్యేక IAS కమిటీ పరిశీలన అనంతరం తిరిగి విధుల్లోకి తీసుకున్నామని మంత్రి తెలిపారు.

కారుణ్య నియామకాల సమస్యకు పరిష్కారం :
విధి నిర్వహణలో మరణించిన లేదా అకాల మరణానికి గురైన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల సమస్యను పరిష్కరించామని మంత్రి తెలిపారు. బ్రెడ్ విన్నర్స్ స్కీమ్ కింద 1,424 కారుణ్య నియామకాలు చేపట్టి బాధిత కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించామని చెప్పారు.

ఉద్యోగులకు రెండు PRCలు – 5 DAలు :
ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం రెండు PRCలు ఇచ్చిందని, ఐదు DAలు మంజూరు చేసిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం పెండింగ్ DAలు లేవని చెప్పారు. ప్రతి నెల మంగళవారం కార్మికుల గ్రీవెన్స్ డే నిర్వహిస్తూ వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహిస్తున్నామని, ఎన్నికల్లో గెలిచిన ప్రతినిధులతో అధికారుల కమిటీ ఏర్పాటు చేసి విలీన ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఇబ్బందులు పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

ఆర్టీసీ ఆర్థిక స్థిరత్వం దిశగా అడుగులు :
ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పెండింగ్ బకాయిలను క్రమబద్ధీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. CCS బకాయిలు: రూ.1,096 కోట్ల నుంచి రూ.939 కోట్లకు తగ్గించామ‌ని, PF బకాయిలు: రూ.2,108 కోట్ల నుంచి రూ.1,710 కోట్లకు తగ్గించామ‌ని, SRBS & SBT బకాయిలు: రూ.513 కోట్ల నుంచి రూ.485 కోట్లకు తగ్గించామ‌న్నారు. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బకాయిల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

రవాణా శాఖలో ఆధునిక సాంకేతికత :
తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్‌లో TS స్థానంలో TG విధానాన్ని 15 మార్చి 2024 నుంచి అమల్లోకి తీసుకొచ్చామని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 23.41 లక్షల కొత్త వాహనాలు TG రిజిస్ట్రేషన్‌తో నమోదయ్యాయని చెప్పారు. రవాణా శాఖ సేవలను ప్రజలకు మరింత సులభతరం చేసేందుకు వాహన్, సారథి సేవలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. గత పదేళ్లుగా తెలంగాణ మాత్రమే వాహన్ వ్యవస్థలో చేరలేదని, ముఖ్యమంత్రి సూచనల మేరకు తెలంగాణను వాహన్ వ్యవస్థలోకి తీసుకొచ్చామని చెప్పారు. పాత వాహనాలను దశలవారీగా తొలగించి కాలుష్యాన్ని తగ్గించడం, రోడ్డు భద్రతను పెంచడం లక్ష్యంగా వాహన స్క్రాపింగ్ పాలసీ తీసుకొచ్చామని తెలిపారు.

ఎలక్ట్రిక్ వాహనాలకు భారీ ప్రోత్సాహం :
రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రిజిస్ట్రేషన్ ఫీజు, మోటార్ వెహికల్ ట్యాక్స్‌లో మినహాయింపులు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 1,58,157 ఎలక్ట్రిక్ వాహనాలకు రూ.1,493 కోట్ల మేర మినహాయింపు లభించిందని చెప్పారు. ఆటో కార్మికులు సమ్మెకు వెళ్లకుండా వారి న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2012 తర్వాత ఆటో చార్జీలు పెరగలేదని, చార్జీల పెంపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, వారం రోజుల్లో సమావేశం నిర్వహించి దీనిపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. హైదరాబాద్‌లో డీజిల్, పెట్రోల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా రెట్రోఫిట్ చేసుకునేందుకు ఒక్కో వాహనానికి రూ.1.50 లక్షల వరకు ప్రభుత్వ సహాయం అందిస్తామని తెలిపారు. బైక్ ట్యాక్సీలకు ఎల్లో ప్లేట్ ఏర్పాటు చేసే అంశంపై కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ORR పరిధిలో కొత్త వాహనాల నమోదుకు ప్రభుత్వం అనుమతులు కల్పించిందని మంత్రి తెలిపారు. ఎలక్ట్రిక్ త్రీ వీలర్లకు 20,000, CNG ఆటోలకు 10,000, LPG ఆటోలకు 10,000, రెట్రోఫిటెడ్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్లకు 25,000 అనుమతులు కేటాయించినట్లు చెప్పారు. రోడ్డు భద్రత కోసం Education, Enforcement, Engineering, Emergency అనే 4E వ్యూహంతో కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. పాఠశాలల్లో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, పోలీస్ శాఖతో కలిసి ‘Arrive – Alive’ కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను వెంటనే ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించేందుకు రహవీర్ స్కీమ్ అమలు చేస్తున్నామని తెలిపారు. రోడ్డు భద్రతా సెస్‌ను రోడ్డు భద్రతా కార్యక్రమాలకే వినియోగించేలా చట్టపరమైన చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించేందుకు 60 ANPR కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. రవాణా వ్యవస్థలో AI సాంకేతికతను వినియోగించి పర్యవేక్షణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించామని చెప్పారు. రవాణా శాఖలో 113 AMVI లు, 50 మంది కానిస్టేబుళ్లు, 20 మంది జూనియర్ అసిస్టెంట్లు, 4 MVI లను నియమించామని తెలిపారు. రవాణా శాఖలో వేధింపులకు తావులేకుండా చెక్‌పోస్టులను ఎత్తివేశామని, జిల్లాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలను పెంచామని మంత్రి వెల్లడించారు. ఆర్టీసీ కేవలం రవాణా సంస్థ మాత్రమే కాదని, పేద, మధ్యతరగతి ప్రజలకు లైఫ్‌లైన్ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దేశంలో రైల్వేలకు ఉన్న ప్రాధాన్యత మాదిరిగానే తెలంగాణలో ఆర్టీసీ ప్రజల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఆర్టీసీని దేశంలోనే ఉన్నత స్థానంలో నిలిపేందుకు డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహకారంతో రవాణా శాఖకు అవసరమైన నిధులు మంజూరు అవుతున్నాయని, ఆర్టీసీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. సిబ్బంది కృషి, అధికారుల పనితీరు, ప్రభుత్వ విధానాలతో ఆర్టీసీని భవిష్యత్తులో దేశంలోనే నంబర్‌-1 ప్రజా రవాణా సంస్థగా తీర్చిదిద్దుతామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి, రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, జేటీసీ చంద్రశేఖర్ గౌడ్, ఈడీ లు సిహెచ్.వెంకన్, ఎం.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page