హైదరాబాద్, సెప్టెంబర్ 23, ( అద్దం న్యూస్ ) : రాష్ట్రంలో 14 లక్షల మంది కాలేజీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజుల బకాయిలు 8500 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని, ఈ స్కీము ఎత్తివేయాలనే కుట్రలు మానుకోవాలని, ఈ స్కీమును యధాతధంగా పాత పద్ధతిలోనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది విద్యార్థులు బుధవారం హైదరాబాద్ విద్యానగర్ వివేకానంద ప్రభుత్వ కాలేజీ నుంచి భారీ ప్రదర్శన జరిపారు. ఈ ప్రదర్శనకు రాష్ట్ర విద్యార్ధి సంఘం అధ్యక్షుడు పగిళ్ళ సతీష్ నాయకత్వం వహించారు. ఈ భారీ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ… స్కాలర్‌షిప్ స్కీముకు బడ్జెట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి పేద కులాల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. ఫీజుల బకాయిలు ఇవ్వాలని శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీల పిల్లలు చదువుకుంటుంటే కూడా ఓర్వలేక పోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టిస్తున్నారని, పేద కులాలు చదువుకోకుండా కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ ఫీజుల బకాయిలు 8500 కోట్ల రూపాయలను చెల్లించడం ముఖ్యమంత్రికి ఒకలెక్క కాదని… మూడున్నర సంవత్సరాలుగా విద్యార్ధులు పడుతున్న భాదలు చెప్పతరం కాదన్నారు. కోర్సు పూర్తి అయిన 6 లక్షల మందికి కాలేజి యాజమాన్యాలు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదన్నారు. వీరికి ఉద్యోగాలు వచ్చిన చేరలేక ఉన్నత విద్యకు పోలేక దాల ఇబ్బంది పడుతున్నారని, చదువుతున్న వారి ఫీజులు కట్టే వరకు కాలేజీలకు రానివ్వడంలేదన్నారు. ఫీజుల బకాయిలు చెల్లించక పోవడంతో విద్యార్థులు నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆర్.కృష్ణయ్య తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికరంలోకి వచ్చిన తరువాత బిసిలకు ఒక చిన్న స్కీము కూడా పెట్టలేదన్నారు.
ఉన్న స్కీములనే సరిగా నడపడం లేదని, బిసి సంక్షేమ శాఖను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. బిసి శాఖలో ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఈడి, ఎండి లు నాన్ బిసిలను నియమించి బిసి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్నారు. బిసి కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదని.. బిసి శాఖలో బిసిలే లేరన్నారు. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో అవకతవకలు జరిగాయి. వాటిపై విచారణ జరుపుతున్నామని, విచారణ పూర్తి అయిన తర్వాత బడ్జెటు ఇస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించారని, అవక తవకలు లేని యూనివర్సిటీ కాలేజిలు, ప్రభుత్వ డిగ్రీ – జూనియర్ కాలేజీలలో ఎలాంటి అవకతవకలు లేవని… అలంటి కాలేజీలకు బడ్జెటు ఇవ్వడానికి అభ్యంతరం లేమిటిని కృష్ణయ్య ప్రశ్నించారు. నిజాం కాలేజి, కోటి ఉమెన్స్ కాలేజి సికింద్రాబాద్ పీజి కాలేజి, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజిలలో చదువు పూర్తి చేసిన వేలాది మంది విద్యార్ధులకు సర్టిఫికేట్లు ఇవ్వడం లేదన్నారు. ఫీజుల స్కీముపై ముఖ్యమంత్రి రాద్ధాంతం చేయకుండా వెంటనే బకాయిలు ఇవ్వాలని, బకాయిలు ఇవ్వకపోవడం వలన కోర్సు పూర్తి అయినా వారు దాదాపు 6 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీలలో ఉన్నాయని విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఇది చాలా చిన్న సమస్య, దీనిని సవాలుగా తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఫీజుల బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. ఈ భారీ ప్రదర్శనలో రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్, బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ సి.రాజేందర్, నరేష్ గౌడ్, నిఖిల్ పటేల్, కాడరి శివ కుమార్ యాదవ్, రమేష్, రాహుల్, సురేష్, రమణ, కె.వంశీ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.