వెంటనే రూ. 8,591 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయాలి
• ప్రభుత్వం స్పందించకపోతే అసెంబ్లీ ముట్టడితో పాటు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు తప్పవు
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్
హైదరాబాద్, నవంబర్ 11, ( అద్దం న్యూస్ ) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యా రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, సుమారు రూ.8,500 కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో పెట్టి, లక్షలాది మంది పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసిందని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రస్తుతం సంక్షేమ శాఖల లెక్కల ప్రకారం దాదాపు రూ.8,591.63 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు పేరుకుపోయాయన్నారు. గత మూడు విద్యా సంవత్సరాల ( 2023-24 నుండి 2025-26 వరకు ) డిమాండ్ దాదాపు రూ.7,673.78 కోట్లు కాగా, ప్రభుత్వం విడుదల చేసింది కేవలం 28 శాతమే ( రూ.2,160.03 కోట్లు ), మిగతా 72 శాతం ( రూ.5,513.75 కోట్లు ) బకాయిలను చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని కన్వీనర్ నల్లెల్ల కిషోర్ఆగ్రహం వ్యక్తం చేసారు. ముఖ్యంగా బీసీ విద్యార్థులకు సంబంధించి 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 96 శాతానికి పైగా బకాయిలు ( రూ.922.92 కోట్లలో ) చెల్లించలేదని విమర్శించారు. మైనారిటీ విద్యార్థులకు రూ.251.86 కోట్ల దరఖాస్తులు వెరిఫై అయినా పైసా నిధులు విడుదల చేయకపోవడం శోచనీయమన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లను యాజమాన్యాలు నిలిపివేయకుండా ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చి, కాలేజీలకు స్పష్టమైన చెల్లింపు క్యాలెండర్‌ను ప్రకటించాలని, పేద విద్యార్థుల విద్యను పణంగా పెడితే రాబోయే రోజుల్లో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని కన్వీనర్ నల్లెల్ల కిషోర్ హెచ్చరించారు.
టిడిపి రాష్ట్ర బీసీ సెల్ మాజీ అధ్యక్షుడు శ్రీపతి సతీష్ మాట్లాడుతూ… ప్రభుత్వం ఉచిత హామీల పేరుతో లబ్ధి పొంది నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువులకు వెన్నుముక లాంటి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విస్మరించడం దారుణమని అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలకు నిధులు అందక, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ధర్నాలు, బంద్ పాటించే పరిస్థితి వచ్చిందన్నారు. టిడిపి రాష్ట్ర ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పి.అశోక్ మాట్లాడుతూ.. కోర్సు పూర్తయిన విద్యార్థులకు ప్రైవేట్ కళాశాలలు సర్టిఫికెట్లు ఇవ్వక పోవడంతో, ఉన్నత విద్యకు వెళ్లలేక, ఉద్యోగ అవకాశాలు సాధించలేక లక్షలాది మంది తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని న్నారు. ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక బడ్జెట్ నిధులు కేటాయించి పెండింగ్‌లో ఉన్న రూ.8,591 కోట్ల బకాయిలను ఒకే విడతలో విడుదల చేయాలని డిమాండ్ చేసారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ పలుస బాల్‌రాజ్ గౌడ్, నాయకులు భవాని శ్రీనివాస్, భానుప్రకాష్, వైఎల్.నర్సింహా గౌడ్ తదితరులు పాల్గొన్నారు.