Addam News
Newspaper Banner
Date of Publish : 10 October 2026, 3:10 am Posted by : Addam News

అక్ర‌మంగా భ‌వ‌నాన్ని నిర్మిస్తున్న వ్య‌క్తి పై చ‌ర్య‌లు తీసుకోండి – జిహెచ్ఎంసి జోన‌ల్ క‌మిష‌న‌ర్‌కు విన‌తి

ముషీరాబాద్, అక్టోబర్ 9, ( అద్దం న్యూస్ ) :     జిహెచ్ఎంసి స‌ర్కిల్‌–41 ప‌రిధిలోని ముషీరాబాద్ డివిజ‌న్ గంగ‌పుత్ర‌కాల‌నీలో 1-6-174/3/A/B అడ్ర‌స్సులో గ‌ల‌ వంద గ‌జాల స్థ‌లంలో ఐదు అంత‌స్తుల భ‌వ‌నాన్ని అక్ర‌మంగా నిర్మిస్తున్నార‌ని, దానికి తోడు 33 కేవి హై టెన్ష‌న్ విద్యుత్ లైన్ తీగ‌లు వెళ్తున్న ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో నిర్మిస్తున్న ఇంటి పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని స్థానికులు మాదేశి రాజేంద‌ర్, గోపినాథ్ లు కోరారు. ఈ మేర‌కు జిహెచ్ఎంసి జోన‌ల్ క‌మిష‌న‌ర్ మంగ‌తాయారు ను క‌లిసి శుక్ర‌వారం వినతి ప‌త్రాన్ని అంద‌చేశారు. అనంత‌రం వారు మాట్లాడుతూ… 100 వంద గ‌జాల స్థ‌లంలో అక్ర‌మంగా ఐదు అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మిస్తున్నార‌ని అన్నారు. ఆ భ‌వ‌నం ప‌క్క నుంచే 33 కేవి విద్యుత్ హైటెన్ష‌న్ తీగ‌ల లైన్ ఉంద‌ని, గ‌తంలో ఈ తీగ‌ల‌కు త‌గిలి చాలా మందికి గాయాల‌య్యాయ‌న్నారు. ఇటీవల కాలంలో అదే భ‌వ‌న నిర్మాణం కూలీలు ఇద్దరికి 33 కేవీ హై టెన్షన్ లైన్ షాక్‌కు గురై పై నుంచి కిందపడిపోయారని, వారి శరీరాలకు తీవ్రమైన గాయాలయ్యాయని తెలిపారు. ఈ నెల 5వ తేదీ సైతం అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింద‌ని, టౌన్ ప్లానింగ్ ఏసిపి వ‌చ్చి అక్ర‌మంగా నిర్మాణం చేయ‌వ‌ద్ద‌ని చెప్పి, నోటీసులు ఇచ్చార‌ని తెలిపారు. అధికారులు నోటీసులు ఇచ్చినా, వ‌ద్ద‌ని ఆదేశాలు చేసినా ప‌ట్టించుకోకుండా అర్థ‌రాత్రి పూట అద‌నంగా మ‌రో అంత‌స్తు నిర్మాణం చేప‌ట్టార‌న్నారు. 33 కేవి విద్యుత్ హై టెన్ష‌న్ తీగ‌ల‌కు త‌గిలి ఎవ‌రికైనా ప్రమాదం జ‌రుగ‌కముందే, ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు కాకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. క్షేత్రస్థాయి తనిఖీ జరిపించి అక్ర‌మంగా భ‌వ‌నాన్ని నిర్మిస్తున్న ఇంటి య‌జ‌మాని పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.