తార్నాక, సెప్టెంబర్ 27, ( అద్దం న్యూస్ ) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఉద్యమకారుల సమస్యలు, వారి సంక్షేమం, గుర్తింపు, గౌరవం వంటి అంశాలపై చర్చించేందుకు నిర్వహించిన రాష్ట్ర సదస్సుకు తార్నాక ప్రాంతం నుంచి తెలంగాణ ఉద్యమకారులు ప్రత్యేక బస్సులో తరలివెళ్లారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర సదస్సుకు హాజరయ్యేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సును తార్నాక చౌరస్తా వద్ద గ్రేటర్ హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీలత శోభన్‌రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యమకారుల పోరాటం, త్యాగాలు మరువలేనివని అన్నారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల పాత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షలు, ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయి వేదికపై చర్చించడం ద్వారా భవిష్యత్ కార్యాచరణకు మార్గం ఏర్పడుతుందని తెలిపారు. ఉద్యమకారుల సంక్షేమం, గౌరవం కోసం చేపట్టే కార్యక్రమాలకు తనవంతు సహకారం కొనసాగిస్తానని శ్రీలత శోభన్‌రెడ్డి స్పష్టం చేశారు. తార్నాక ప్రాంతం నుంచి ప్రత్యేక బస్సులో బయలుదేరిన ఉద్యమకారులు రాష్ట్ర సదస్సులో పాల్గొని తమ సమస్యలు, డిమాండ్లను వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలంగాణ ఉద్యమకారులు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.