Addam News
Newspaper Banner
Date of Publish : 17 November 2026, 10:25 am Posted by : Addam News

కోటి దీపోత్స‌వ వేడుక‌ల‌కు హాజ‌రైన‌ తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ శివ్‌ ప్ర‌తాప్ శుక్లా

హైద‌రాబాద్‌, ( అద్దం న్యూస్ ) :     హైదరాబాద్ ఎన్‌టిఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం మూడో రోజు అయిన సోమ‌వారం కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జ‌రిగాయి. శంఖారావం, వేదపఠనంతో ప్రారంభమైన కార్యక్రమాల్లో మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. పర్ణిక బృందం భక్తిగీతాలు ఆలపించగా, సప్తస్వరాలు బృందం వీణా వాయిద్యంతో భక్తులను అలరించింది. అనంతరం చాగంటి కోటేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. వేదికపై శివపరివారానికి కోటి పుష్పార్చన నిర్వహించగా, ప్రాంగణంలో భక్తులు శివలింగాలకు పుష్పార్చన చేశారు. కీసరగుట్ట శ్రీరామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. కాశీ జగద్గురు చంద్రశేఖర శివాచార్య మహాస్వామి, శివయోగీశ్వర సాధు సంస్థానం మఠం డా. శివానంద భారతి మహాస్వామి పాల్గొన్నారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పెరుగు శ్రీసుధ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

అనంతరం 108 మందితో బంగారు శివలింగం వద్ద పంచహారతులు నిర్వహించారు. పల్లకీపై కీసరగుట్ట ఉత్సవమూర్తుల ఊరేగింపు నిర్వహించారు. పీఠాధిపతుల అనుగ్రహభాషణం, అతిథుల ప్రసంగాలు కొనసాగాయి. పీఠాధిపతులు, అతిథులు, ఛైర్మన్ దంపతులతో పాటు భక్తులు సామూహిక కార్తిక దీపారాధన నిర్వహించారు. సప్తతి, మహానీరాజనం, గురువందనం, అతిథుల సత్కారం కార్యక్రమాలు జరిగాయి. చివరిగా మద్దాళి సౌందర్య బృందం కూచిపూడి నృత్యం, భావనదీప్తి బృందం ఫ్యూజన్ నృత్యం, అనన్యా రెడ్డి బృందం నృత్య ప్రదర్శన, పంబమేళా విన్యాసం, కోలాట కదంబం భక్తులను ఆకట్టుకున్నాయి.