Addam News
Newspaper Banner
Date of Publish : 13 November 2026, 2:10 am Posted by : Addam News

తెలంగాణలో 21 ఐపీఎస్ అధికారుల బదిలీలు – హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా మహేష్ మురళీధర్ భగవత్ నియామకం

తెలంగాణ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :   

తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐపీఎస్‌లకు స్థానచలనం కల్పిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సీపీగా మహేష్ భగవత్, ఏసీబీ డీజీగా చారు సిన్హా, ఆర్టీసీ ఎండీగా డాక్టర్ అనిల్ కుమార్, సివిల్ సప్లైస్ కమిషనర్‌గా వై.నాగిరెడ్డి నియమితులయ్యారు. వీరితో పాటు పలు కీలక విభాగాలకు కొత్త అధికారులను నియమిస్తూ సీఎస్ సంజయ్ జాజు జీవో విడుదల చేశారు. హైదరాబాద్ నూతన సీపీగా మహేష్ భగవత్ నియమితులు కాగా ప్రస్తుత సీపీ వీసీ సజ్జనార్‌ను ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ డీజీగా ప్రభుత్వం బదిలీ చేసింది.

మహిళా భద్రత, షీ టీమ్స్, భరోసా విభాగం డీజీపీగా డా.సౌమ్య మిశ్రా నియమితులయ్యారు. ఆమెకు ఆర్గనైజేషన్, లీగల్ విభాగాల అదనపు బాధ్యతలు కూడా ఇచ్చారు. జైళ్ల శాఖ డీజీగా స్వాతి లక్రా బదిలీ కాగా, ఆమెకు హోంగార్డ్స్ అదనపు బాధ్యత లు అప్పగించారు. అవినీతి నిరోధక శాఖ ( ఏసీబీ ) డీజీగా చారు సిన్హా నియమితులయ్యారు. ఆమెకు సీఐడీ డీజీగా అదనపు బాధ్యతలు కొనసాగనున్నాయి. ఏసీబీ డైరెక్టర్‌గా ఎస్.చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు.

తెలంగాణ ఆర్టీసీ వైస్ ఛైర్మన్ అండ్ ఎండీగా డా.అనిల్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న వై.నాగిరెడ్డిని సివిల్ సప్లైస్ కమిషనర్, ఎక్స్-అఫీషియో ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ చేశారు. గ్రేహౌండ్స్, ఆక్టోపస్ ఆపరేషన్స్ డీజీపీగా విక్రమ్ సింగ్ మాన్, టీజీ-టీఎంఏఆర్ఎస్ డైరెక్టర్‌గా ఎం.స్టీఫెన్ రవీంద్ర, శాంతిభద్రతల ( ఎల్ అండ్ ఓ ) ఏడీజీపీగా అకున్ సభర్వాల్ నియమితులయ్యారు.

అలాగే, మల్టీ జోన్-1 ఐజీగా కార్తికేయ ( ఐసీసీసీ డైరెక్టర్ అదనపు బాధ్యతలు ), రైల్వేస్ ఐజీగా కె.రమేష్ నాయుడు, మల్టీ జోన్-2 డీఐజీగా నారాయణ నాయక్, జోన్-7 ( జోగులాంబ ) డీఐజీగా జి.చందన దీప్తి ( అదనపు బాధ్యతలు ) నియమితులయ్యారు. రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ జాయింట్ డైరెక్టర్‌గా డి.జోయల్ డేవిస్‌కు బాధ్యతలు అప్పగించారు. శ్రీబాలా దేవి ని TG-TMARS డిప్యూటీ డైరెక్టర్ ( అడ్మిన్ ) గా నియమించారు. వి.అరవింద బాబు ను హైదరాబాద్ సిటీ డీసీపీగా నియమించారు.