Addam News
Newspaper Banner
Date of Publish : 20 November 2026, 6:17 am Posted by : Addam News

మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన టీజీఎస్ ఆర్టీసీ ఎండీ డాక్టర్ అనిల్ కుమార్

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 19, ( అద్దం న్యూస్ ) :

​తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( TGSRTC ) నూతన వైస్ చైర్మన్ అండ్‌ మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ అనిల్ కుమార్ గురువారం ఉదయం హైదరాబాద్‌లో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ​ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ మహాలక్ష్మి – ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘ తీరుతెన్నులు, మహిళా ప్రయాణికుల పెరిగిన రద్దీకి అనుగుణంగా అదనపు బస్సు సర్వీసుల నిర్వహణపై ఇరువురు సమగ్రంగా సమీక్షించారు. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సుల ( EV ) సంఖ్యను పెంచడం, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, నూతన బస్సుల కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంపై అభిప్రాయాలను పంచుకున్నారు. ​దీంతో పాటు ఆర్టీసీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితి, ఆక్యుపెన్సీ రేషియోను పెంచుతూ సంస్థను మరింత బలోపేతం చేసే వ్యూహాత్మక చర్యలపై వారు చర్చించారు.

సామాన్య ప్రయాణికులకు మరింత మెరుగైన, సురక్షితమైన, నాణ్యమైన రవాణా సేవలను అందించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని నిర్ణయించారు. ​ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన డాక్టర్ అనిల్ కుమార్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆర్టీసీని దేశంలోనే ఆదర్శవంతమైన సంస్థగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.