Addam News
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 10:34 am Posted by : Addam News

ఏసిబి వలకు చిక్కిన టీజీఎస్‌పిడీసీఎల్ గాంధీనగర్ సెక్షన్ సబ్ ఇంజినీర్

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 21, ( అద్దం న్యూస్ ) :      టీజీఎస్‌పిడీసీఎల్ గాంధీనగర్ సెక్షన్ సబ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న జి.సంతోష్‌ ఆనంద్ శనివారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు దొరికారు. ఏసిబి అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్‌లో నివ‌సించే హైకోర్టు ఉద్యోగినికి చెందిన ఇంటి విద్యుత్ మీట‌ర్‌ను ఆమెకు స‌మాచారం ఇవ్వ‌కుండానే సెక్ష‌న్ స‌బ్ ఇంజినీర్ సంతోష్ ఆనంద్ తీసుకెళ్లాడు. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా విద్యుత్‌ను వాడుతున్నార‌ని, ల‌క్ష రూపాయ‌ల ఫైన్ చెల్లించాల‌ని స‌ద‌రు మ‌హిళ‌తో సంతోష్ ఆనంద్ తెలిపాడు. విద్యుత్ దొంగతనం ఆరోపణకు సంబంధించి ఫిర్యాదుదారునిపై తదుపరి చర్యలు తీసుకోకుండా అధికారికంగా అనుకూలత చూపినందుకు తొలుత రూ.50 వేల రూపాయ‌లు ఇవ్వాల‌ని సంతోష్ ఆనంద్ డిమాండ్ చేశాడు. బేర‌సారాలు అయ్యాక రూ.30 వేల రూపాయ‌ల‌ను తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు.

    చివ‌ర‌కు 30 వేల రూపాయ‌లను శ‌నివారం స‌ద‌రు మ‌హిళ నివాసం వ‌ద్ద తీసుకుంటుండ‌గా ఏసిబి అధికారులు అత‌న్ని రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. అప్ప‌టికే 30 వేల రూపాయ‌ల‌ను తీసుకొని త‌న ప్యాంట్ వెనుక ఎడ‌మ జేబులో పెట్టుకున్నాడు. అత‌ని వ‌ద్ద నుంచి రూ.30 వేల న‌గ‌దును ఏసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అత‌న్ని అరెస్టు చేశారు. జ్యుడిషియల్ రిమాండ్ కోసం హైదరాబాద్‌లోని ఎస్‌పిఈ & ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు ప‌రుస్తామ‌ని ఏసిబి అధికారులు తెలిపారు.