Addam News
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 9:12 pm Posted by : Addam News

సెల్ ట‌వ‌ర్‌ ఏర్పాటు ప్ర‌క్రియ‌ను పూర్తిగా విర‌మించుకునే వ‌ర‌కు ఉద్య‌మం ఆగ‌దు

సెల్ ట‌వ‌ర్‌ ఏర్పాటు ప్ర‌క్రియ‌ను పూర్తిగా విర‌మించుకునే వ‌ర‌కు ఉద్య‌మం ఆగ‌దు
– తేల్చి చెప్పిన రాంన‌గ‌ర్ వాసులు

హైద‌రాబాద్‌, మే 22, ( అద్దం న్యూస్ ) :  రాంన‌గ‌ర్ చౌర‌స్తా నుంచి పార్శిగుట్ట వెళ్లే దారిలో గ‌ల ఓ స్వీట్ షాప్ భ‌వ‌నం పై సెల్ ట‌వ‌ర్‌ను ఏర్పాటు చేసేందుకు అందుకు సంబంధించి సామాగ్రిని తెచ్చార‌ని, సెల్ ట‌వ‌ర్‌ను ఏర్పాటు ప్ర‌క్రియ‌ను పూర్తిగా విర‌మించుకునే వ‌ర‌కు ఉద్య‌మం ఆగ‌ద‌ని రాంన‌గ‌ర్ వాసులు స్ప‌ష్టం చేశారు. శ‌నివారం ఓ స్వీట్ షాపు భ‌వ‌నం పైసెల్ ట‌వ‌ర్‌ను ఏర్పాటు చేస్తున్నార‌ని స‌మాచారాన్ని తెలుసుకున్న రాంన‌గ‌ర్‌లో స్థానికులు ఆందోళ‌న చేప‌ట్టారు. సెల్ ట‌వ‌ర్‌ను ఏర్పాటు చేయ‌వ‌ద్ద‌ని, భ‌వ‌నం కింద సెల్లార్‌లో ఉన్న షాప్‌ను తొల‌గించాల‌ని, భ‌వ‌నం ముందు రోడ్డును ఆక్ర‌మించి బండ్ల‌ను తొల‌గించాల‌ని నినాదాలు చేశారు. అనంత‌రం స్థానికులు క‌ల్వ వీరేంద‌ర్ గుప్త‌, సునిత‌, వెంక‌టేష్‌, ర‌వి, పాండు, సందీప్ ముదిరాజ్‌, కంచి ముదిరాజ్ త‌దిత‌రులు భ‌వనానికి సంబంధించిన మ‌రో ఓన‌ర్‌తో క‌లిసి ముషీరాబాద్ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసి, ఆ త‌ర్వాత జిహెచ్ఎంసి క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్‌ను క‌లిసి స‌మ‌స్య‌ను వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌ల్వ వీరేంద‌ర్ గుప్త మాట్లాడుతూ… భవన నిర్మాణ సమయంలో సెల్లార్‌ను పార్కింగ్ కోసం చూపించినప్పటికీ, ప్రస్తుతం అదనపు ఆదాయం కోసం అక్కడ షాపులు నిర్మించి అద్దెకు ఇస్తున్నార‌న్నారు. దీంతో రాంనగర్ చౌరస్తాలో ఇప్పటికే ఉన్న ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.

అంతే కాకుండా భవనం ముందు రోడ్డును కూడా ఆక్రమించి చెరుకు రసం బండ్లు, మిర్చి బండ్లు, జ్యూస్ పాయింట్లు, టీ స్టాళ్లకు అద్దెకు ఇచ్చి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారని అన్నారు. లక్షల రూపాయలు అద్దె రూపంలో తీసుకుంటూ ప్రభుత్వానికి సరైన పన్నులు చెల్లించడంలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇందుకు స్పందించిన క‌మిష‌న‌ర్ క‌ర్ణ‌న్ త‌క్ష‌ణ‌మే సెల్ ట‌వ‌ర్ ఏర్పాటు ప‌నుల‌ను నిలిపివేసి, అందుకు సంబంధించి సామాగ్రిని స్వాధీనం చేసుకోవాల‌ని, రోడ్డు ఆక్రమణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ముషీరాబాద్ స‌ర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసిపిని ఆదేశించార‌ని వీరేంద‌ర్ తెలిపారు. టౌన్ ప్లానింగ్ ఏసిపి ఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చి సెల్ ట‌వ‌ర్‌కు సంబంధించిన సామాగ్రిని కొంత త‌ర‌లించార‌ని, సోమ‌వారం వ‌చ్చి పూర్తిగా తీసుకెళ్తామ‌ని అధికారులు తెలిపార‌ని వీరేంద‌ర్ గుప్త పేర్కొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png