Addam News
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 8:08 am Posted by : Addam News

సేవాభావం, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసమే స్కౌట్స్ అండ్ గైడ్స్ లక్ష్యం‎

‎ఇతరులకు ఉపయోగపడేలా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి‎
‎నాయకత్వమంటే పదవి కాదు.. ఎంత మందికి సేవ చేయగలమన్నదే ముఖ్యం
‎భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ పాఠశాల అభివృద్ధికి సింగరేణి నుంచి రూ.2.5 కోట్ల సాయం
– డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైద‌రాబాద్ బ్యూరో, అక్టోబర్ 30, ( అద్దం న్యూస్ ) : ‎    విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, సేవాభావం, నాయకత్వ లక్షణాలతో పాటు నైతిక విలువలను పెంపొందించడంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. జీవితంలో వ్యక్తిగత విజయాలు సాధించడంతో పాటు ఇతరులకు ఉపయోగపడేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. నాయకత్వమంటే ఎంతమంది మనకు సేవ చేస్తున్నారనేది కాదని, మనం ఎంతమందికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నామనేదే అసలైన నాయకత్వ లక్షణమని పేర్కొన్నారు. హైద‌రాబాద్ ‎దోమలగూడలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హైస్కూల్ నవీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్ల తో కలిసి భ‌ట్టి విక్ర‌మార్క హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఉప‌ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క మాట్లాడుతూ… స్కౌట్స్ అండ్ గైడ్స్ నినాదమైన ‘ఎప్పుడూ సిద్ధంగా ఉండండి’ అనే రెండు పదాల వెనుక గొప్ప జీవిత తత్వం దాగి ఉందన్నారు. పరీక్షలు, ఉద్యోగాలు, పదోన్నతులు, వ్యక్తిగత విజయాల కోసం సిద్ధమవడం కంటే కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండటమే గొప్ప లక్షణమని చెప్పారు. ‎ప్రస్తుత కాలంలో కృత్రిమ మేధస్సు, సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు అందిస్తున్నాయని, అయితే మనం ఎలాంటి మనుషులుగా ఎదగాలనే ప్రశ్నకు మాత్రం సాంకేతికత సమాధానం చెప్పలేదన్నారు. విద్య జ్ఞానాన్ని అందిస్తే, శీలం ఆ జ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే అర్హతను కల్పిస్తుందని పేర్కొన్నారు. నాయకత్వంతోపాటు ఇతరులను అనుసరించడం, పోటీపడటంతోపాటు సహకరించడం, స్వతంత్రంగా ఉంటూనే సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించడం స్కౌట్స్ అండ్ గైడ్స్ నేర్పించే గొప్ప పాఠాలని వివరించారు. ‎మహాత్మా గాంధీ పదవులు, అధికారంతో కాకుండా తన ఆచరణ, వ్యక్తిత్వం ద్వారా లక్షలాది మందికి నాయకత్వం వహించారని గుర్తుచేశారు. దేశానికి అవసరమైన నాయకత్వం కూడా అలాంటిదేనని అన్నారు.
‎
‎70 వేల మందికి చేరువైన స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం :‎
‎గవర్నర్ మార్గదర్శకత్వంలో తెలంగాణలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉద్యమం గణనీయంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఏడాది కాలంలో సభ్యుల సంఖ్య దాదాపు 70 వేల స్థాయికి చేరిందని చెప్పారు. ఈ కార్యక్రమాలను 3,200కు పైగా ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించి, సుమారు 1.3 లక్షల మంది విద్యార్థులకు చేరువ చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. విద్యార్థులు మరింత ధైర్యవంతులు, దయగలవారు, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడమే ఈ ఉద్యమం సాధించిన అసలైన విజయమని పేర్కొన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హైస్కూల్ పునరుద్ధరణ, అభివృద్ధి పనుల కోసం సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ( ఎస్‌సీసీఎల్ ) కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద రూ.2.5 కోట్లు అందించడం అభినందనీయమని  అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గును వెలికితీసే సింగరేణి సంస్థ, ఇప్పుడు పిల్లల్లోని ప్రతిభను వెలికితీసి వారి భవిష్యత్తును ప్రకాశవంతం చేసేందుకు తోడ్పడటం సంతోషకరమని పేర్కొన్నారు. తరగతి గదులు, క్రీడా సౌకర్యాలు, కంప్యూటర్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధితో విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.  స్కౌట్ లేదా గైడ్‌గా ఉండటానికి అసలైన పరీక్ష యూనిఫాం ధరించడం కాదని, ఎవరూ చూడనప్పుడు కూడా ఆ సంస్థ విలువలు, నియమాలను ఎంత నిబద్ధతతో పాటిస్తున్నామన్నదే ముఖ్యమని విద్యార్థులకు హితవు పలికారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సమాజ సేవ, విద్యా రంగ అభివృద్ధి విషయంలో గవర్నర్ మార్గదర్శకత్వాన్ని అనుసరిస్తుందని  హామీ ఇచ్చారు. గాంధేయ సిద్ధాంతాల పట్ల నిబద్ధతతో పాటు పాఠశాలలు, స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, గవర్నర్ కార్యదర్శి దాన కిషోర్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు.