భారత ప్రభుత్వం తక్షణమే శాంతి చొరవ తీసుకోవాలి
– అఖిల భారత శాంతి సంఘీభావం జాతీయ అధ్యక్ష వర్గ సభ్యులు, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ అడ్వైజర్
డాక్టర్ దిడ్డి సుధాకర్
హైదరాబాద్, మార్చి 26, అద్దం న్యూస్ : భారత ప్రభుత్వం తక్షణమే శాంతి చొరవ తీసుకోవాలని అఖిల భారత శాంతి సంఘీభావం జాతీయ అధ్యక్ష వర్గ సభ్యులు, ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ అడ్వైజర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ… ఉక్రెయిన్–రష్యా యుద్ధం మూడేళ్లుగా లక్షలాది కుటుంబాలను చీల్చిపోస్తోందన్నారు. ఇప్పుడు తాజాగా అమెరికా–ఇజ్రాయేల్ మద్దతుతో ఇరాన్‌పై జరుగుతున్న దాడులు ప్రపంచాన్ని మరింత పెద్ద యుద్ధ అంచుల దాకా నెట్టాయన్నారు. ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయిల్ దాడులు, పాలస్తీనా రక్తపాతం, ఉక్రెయిన్ యుద్ధం… ప్రజల ప్రాణాల కంటే ఏ రాజకీయమూ ఎక్కువ కాదు ! అని అన్నారు. ఇరాన్‌లో, పాలస్తీనాలో, యుద్ధ ప్రాంతాల్లో,పిల్లలు, మహిళలు, నిరపరాధ పౌరులు చనిపోతున్నారని, పాఠశాలలు ధ్వంసమవుతున్నాయన్నారు. ఆసుపత్రులు బాంబుల బారిన పడుతున్నాయని, కుటుంబాలు క్షణాల్లో శవాలుగా మారుతున్నాయని సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మానవత్వాన్ని కదిలించే ఘటనలపై, భారత ప్రభుత్వం స్పష్టంగా, ధైర్యంగా, నైతికంగా స్పందించకపోవడం చరిత్ర క్షమించదన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, యుద్ధం ఆపడానికి భారత ప్రభుత్వం చొరవ తీసుకోవాలని, మన రాష్ట్రా అసెంబ్లీలో కేంద్రం మీద వత్తిడి తేవాలని అఖిల భారత శాంతి సంఘీభావం ప్రతిపాదిస్తున్నదన్నారు.
ప్రపంచ యుద్ధాల ప్రభావం ఇప్పటికే భారత ప్రజల ఇళ్లలోకి వచ్చేసిందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగే ముప్పు ఉందని, డాలర్ పెరుగుదలతో రూపాయి బలహీనత అవుతుందని, నిత్యావసర సరుకుల ధరల భారి పెరుగుదలకు అవకాశముందన్నారు. చమురు, ఎరువులు, దిగుమతులపై అనిశ్చితి, పర్యావరణ కాలుష్యం, భవిష్యత్తు ఇంధన సంక్షోభం ఏర్పడుతుందన్నారు. ఇరాన్, పాలస్తీనా, ఉక్రెయిన్ తదితర ప్రాంతాల్లో వెంటనే కాల్పుల విరమణ కోసం చొరవ తీసుకోవాలన్నారు. ఐక్యరాజ్య సమితి ( UN ) వేదిక పై భారత దేశ శాంతి చర్చలు, పౌరుల రక్షణ, మానవ హక్కుల పరిరక్షణ కోసం ముందుండాలన్నారు. ఇలాంటి అత్యంత ప్రమాదకర సమయంలో భారత ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉండటం అత్యంత బాధాకరం, ఆందోళనకరం అని అఖిల భారత శాంతి సంఘీభావం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోందన్నారు. భారతదేశం తన చారిత్రాత్మక అలీన, స్వతంత్ర, సమతుల్య విదేశాంగ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. యుద్ధ ప్రభావాల వల్ల భారత ప్రజలపై పడే ధరల భారం, చమురు సంక్షోభం, ఆర్థిక ఒత్తిడిని తగ్గించే అత్యవసర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించి, యుద్ధ వ్యతిరేక తీర్మానం ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి శాంతి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేయాలని కోరారు. ఇదే విషయాన్ని రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టడానికి ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సంబశివరావు కు అఖిల భారత శాంతి సంఘీభావం రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్ అందచేశారని సుధాకర్ తెలిపారు.![]()

![]()
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png