Addam News
Newspaper Banner
Date of Publish : 29 September 2026, 11:15 pm Posted by : Addam News

గుండె ఎప్పుడూ ముందే హెచ్చరించకపోవచ్చు.. ముప్పును గుర్తించి లక్షణాలు రాకముందే జాగ్రత్త పడాలి – ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గుళ్ల సూర్య ప్రకాశ్

మంచి అలవాట్లతోనే గుండెకు భరోసా.. కేర్ హాస్పిటల్స్ ముషీరాబాద్ అవగాహన నడక
– ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా కేర్ హాస్పిటల్స్ నుంచి గాంధీ ఆసుపత్రి వరకు ‘ హెల్దీ హార్ట్ వాకథాన్ ’ 

 హైద‌రాబాద్‌, సెప్టెంబర్ 29, ( అద్దం న్యూస్ ) :    గుండె ఎప్పుడూ ముందే హెచ్చరించకపోవచ్చు.. ముప్పును గుర్తించి లక్షణాలు రాకముందే జాగ్రత్త పడాలని ముషీరాబాద్ కేర్ హాస్పిట‌ల్‌ ప్రముఖ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గుళ్ల సూర్య ప్రకాశ్ అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ టైమ్ టు బ్రేకప్ ’ ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ కేర్ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో ‘ హెల్దీ హార్ట్ వాకథాన్ ’ నిర్వహించారు. గుండె జబ్బుల నివారణపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు రోజువారీ జీవితంలో ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించాలనే సందేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముషీరాబాద్‌ కేర్ హాస్పిటల్ నుంచి ప్రారంభమైన వాకథాన్ గాంధీ ఆసుపత్రి వరకు సాగి తిరిగి కేర్ హాస్పిటల్స్‌కు చేరుకుంది. కేర్ హాస్పిటల్స్ రీజినల్ డైరెక్టర్–కార్డియాలజీ, సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గుళ్ల సూర్య ప్రకాశ్, ముషీరాబాద్ కేర్ హాస్పిటల్‌ హెచ్‌సీఓఓ డాక్టర్ భారతి ఆసుపత్రి నాయకత్వ బృందంతో కలిసి వాకథాన్‌కు నేతృత్వం వహించారు. వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆరోగ్యకరమైన జీవనశైలితో గుండెను కాపాడుకోవాలనే సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా డాక్టర్ గుళ్ల సూర్య ప్రకాశ్ మాట్లాడుతూ… గుండె జబ్బులు చాలాసార్లు ఒక్కసారిగా వచ్చేవి కావని.. ఏళ్ల తరబడి మన జీవనశైలిలో ఉండే అలవాట్లు క్రమంగా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయన్నారు.

మనం ఏం తింటున్నాం, ఎంత కదులుతున్నాం, ధూమపానం చేస్తున్నామా, తగినంత నిద్రపోతున్నామా, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటున్నాం, రక్తపోటు, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయులను తెలుసుకుంటున్నామా అనే అంశాలన్నీ గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయని వివ‌రించారు. ఛాతీనొప్పి లేదా మరేదైనా హెచ్చరిక వచ్చే వరకు వేచి ఉండకూడదని.. గుండె జబ్బుల నివారణ చాలా ముందుగానే ప్రారంభం కావాలని తెలిపారు. ముషీరాబాద్ కేర్ హాస్పిటల్‌ హెచ్‌సీఓఓ డాక్టర్ భారతి మాట్లాడుతూ… అనారోగ్యానికి గురైన తర్వాత చికిత్స అందించడమే ఆసుపత్రుల బాధ్యత కాదన్నారు. వ్యాధులు రాకముందే ప్రజలను అప్రమత్తం చేయడం, నివారణపై అవగాహన కల్పించడం కూడా ముఖ్యమే అని పేర్కొన్నారు. ‘ హెల్దీ హార్ట్ వాకథాన్ ’, ‘ టైమ్ టు బ్రేకప్ ’ ప్రచారం ద్వారా ప్రతి ఒక్కరూ నా గుండె కోసం నేను వదిలేయాల్సిన ఒక చెడు అలవాటు ఏమిటి ? అని తమను తాము ప్రశ్నించుకోవాలన్నదే మా ఉద్దేశమ‌న్నారు. చిన్న మార్పులను క్రమం తప్పకుండా కొనసాగిస్తే అవే జీవితాంతం ఆరోగ్యాన్ని కాపాడే మంచి అలవాట్లుగా మారతాయన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం ఆ మార్పుకు నాంది కావాలని… కానీ గుండె ఆరోగ్యంపై శ్రద్ధ మాత్రం ప్రతిరోజూ కొనసాగాలని అన్నారు.