పేదల భూములకు, పర్యావరణానికి రక్షణ కల్పించాలి
– తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు డిమాండ్
హైదరాబాద్ బ్యూరో, అక్టోబర్ 24, ( అద్దం న్యూస్ ) : గత కేసీఆర్ ప్రభుత్వం నుండి నేటి వరకు తెలంగాణలో ప్రభుత్వ, పబ్లిక్ భూముల అక్రమాలు, విక్రయాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని, దీనివల్ల భవిష్యత్ తరాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు. హైదరాబాద్ దోమలగూడలోని నగర టిడిపి పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బక్కని నర్సింహులు మాట్లాడుతూ… 1946 నుండి 1951 వరకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం, రక్షిత కౌలుదారీ చట్టం, బూర్గుల రామకృష్ణారావు పాలనలో వచ్చిన భూ సంస్కరణలు దున్నేవాడికే భూమి హక్కును కల్పించాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన ‘ కాలమ్ నంబర్ 16 ’ (కాస్తు కాలమ్) ను తొలగించి, తొమ్మిదో షెడ్యూల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పేద రైతులకు, కౌలుదారులకు తీవ్ర నష్టం కలిగించిందని విమర్శించారు. భూదాన్, గైరాన్, ల్యాండ్ సీలింగ్, సర్ఫేకాస్, సర్ఫేరాయి భూముల వివరాలను శ్వేతపత్రం ద్వారా ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న ముషీరాబాద్ ఆర్టీసీ పరిపాలనా కార్యాలయానికి చెందిన వందల కోట్ల రూపాయల విలువైన అత్యంత ఖరీదైన భూములను విక్రయించడానికి గత ప్రభుత్వం ప్రయత్నించిందని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే బాటలో పయనించడం సరికాదని హితవు పలికారు. విలువైన ప్రభుత్వ ఆస్తులనుమ్మి నిధులు సమకూర్చుకోవడం కాదని, ప్రకృతి వనరులను కాపాడుతూ అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలన్నారు.

ఒకప్పుడు స్వచ్ఛమైన నీటితో కళకళలాడిన మూసీ ( భవనాశిని ) నది నేడు కాలుష్య కాసారంగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. చెరువులు, కుంటలు, వాగులను ఆక్రమించి పర్యావరణాన్ని నాశనం చేయడం వల్లే ఎల్‌నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు తలెత్తుతున్నాయని అన్నారు. హైడ్రా ద్వారా ఆక్రమణలు తొలగించే కార్యక్రమం మంచిదేనని, చెరువులు, కుంటలను కాపాడే ప్రతి చర్యకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. 1995లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జెన్కో, ట్రాన్స్‌కో సంస్కరణల ద్వారా రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేశారని గుర్తు చేశారు. వ్యవసాయ రంగానికి ఆటంకం కలగకుండా ఉచిత, నిరంతర విద్యుత్ అందించడంతో పాటు సోలార్ ( రైతు/ప్రజా ) వ్యవస్థలను ప్రోత్సహించడానికి తగిన సబ్సిడీలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో కొత్తగా చేపడుతున్న ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణ ప్రాంతాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసిన తర్వాతే పర్మిషన్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ కన్వీనర్ నల్లెల్ల కిషోర్, హైదరబాద్ కో–ఆర్డినేటర్ నాగు నగేష్, రాష్ట్ర బిసి సెల్ మాజీ అధ్యక్షుడు శ్రీపతి సతీష్, రాష్ట్ర ఎసి సెల్ మాజీ అధ్యక్షుడు పోలంపల్లి అశోక్, మాజీ కార్పొరేటర్ పలుస బాలరాజ్ గౌడ్, రామ్ నారాయణ్ యాదవ్, శ్యామ్ సుందర్, పరుశురామ్, తడక వినోద్, భాను ప్రకాష్, కరణం కరణ్, భవాని శ్రీనివాస్, బుయ్యన శ్యామ్ సుందర్, బివై.శ్రీకాంత్, కెడి.దినేష్, జోగింధర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.