Addam News
Newspaper Banner
Date of Publish : 25 October 2026, 1:32 pm Posted by : Addam News

రానున్న ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేస్తుంది – రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ ఎస్‌.సింహాద్రి యాదవ్‌

తార్నాక, అక్టోబర్ 25, ( అద్దం న్యూస్ ) :    ధనస్వామ్య, కులాధిపత్య రాజకీయాలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయ సాధన కోసం పీడీఏ ఆధ్వర్యంలో రాజకీయ ఉద్యమాన్ని నిర్మిస్తామని సమాజ్‌వాదీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ ఎస్‌.సింహాద్రి యాదవ్‌ వెల్లడించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు. తార్నాకలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ‘bమీట్‌ ది ప్రెస్‌ ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలు, అభ్యుదయ ప్రజాస్వామికవాదులను ఐక్యం చేసి సామాజిక న్యాయం కోసం పోరాడతామన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు బలహీనపడుతున్నాయని ఆరోపించారు. ఓటు హక్కుల పరిరక్షణలో ఎన్నికల సంఘం విఫలమవుతోందని విమర్శిస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, రాజకీయ అధికారం కొద్ది సామాజిక వర్గాలకే పరిమితమవుతున్నాయని, బలహీన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం లభించడం లేదని సింహాద్రి యాదవ్‌ పేర్కొన్నారు. ప్రైవేటీకరణ విధానాలతో పేదలు, నిరుద్యోగులు, రైతులు, కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పీడీఏ వర్గాల ఐక్యతతో ప్రజాస్వామ్య పరిరక్షణ, పేదల అభ్యున్నతికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా పొలం విజయ్‌కుమార్‌ యాదవ్‌ను హైదరాబాద్‌ జిల్లా అధ్యక్షుడిగా నియమించినట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాముల శ్రీనివాస్‌, ప్రకాష్‌ యాదవ్‌, రవికుమార్‌, మొహమ్మద్ వాజిద్ సిద్దిఖ్ తదితరులు పాల్గొన్నారు.