Addam News
Newspaper Banner
Date of Publish : 14 December 2025, 7:49 am Posted by : Addam News

Panchayat elections: రెండో దశ పంచాయతీ పోరు నేడే

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల (Panchayat elections) నిర్వహణకు రంగం సిద్ధమైంది. 193 మండలాల్లోని 3,911 గ్రామపంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. 12,782 మంది సర్పంచి పదవులకు, 71,071 మంది వార్డు సభ్య స్థానాలకు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 57,22,465 మంది ఓటర్లు 38,337 పోలింగు కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

రెండో దశలో 4333 గ్రామ పంచాయతీ సర్పంచి, 38,350 వార్డు సభ్యుల పదవుల ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. వీటిలో 415 గ్రామ సర్పంచి, 8307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. మరో అయిదు గ్రామాల్లో, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో రెండు గ్రామాల్లో, 18 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3769 కేంద్రాల్లో పోలింగు ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ చేయనున్నారు. రెండో దశ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించి.. రూ. 2,02,84,590 నగదు, రూ. 3,46,95,639 విలువైన మద్యం, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదివారం ఎన్నికలు జరిగే గ్రామాల్లో శనివారం సాయంత్రం ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png