Addam News
Newspaper Banner
Date of Publish : 21 November 2026, 8:49 am Posted by : Addam News

ఘ‌నంగా అలంపురం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వరుల కల్యాణోత్సవం

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 20, ( అద్దం న్యూస్ ) :     హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం శుక్ర‌వారం ఏడవ రోజుకు చేరింది. ప్రబోధిని ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. శంఖారావంతో ఏడో రోజు కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఓల్డ్ ఆల్వాల్‌లోని శ్రీ భ్రామరీ విజయశంకర వేదపాఠశాల విద్యార్థుల వేదపఠనం భక్తులను ఆధ్యాత్మిక వాతావరణంలోకి తీసుకెళ్లింది. అనంతరం ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. బాలత్రిపురసుందరి దేవి దుర్గమ్మ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. డాక్ట‌ర్‌.రమాప్రభ, ఆంధ్రమహిళా సభ బృందం ఆలపించిన భక్తిగీతాలు భక్తులను అలరించాయి. శ్రీ మల్లాది సూర్యకిరణ్ శర్మ ఆధ్యాత్మిక ప్రవచనం భక్తులకు భక్తి సందేశాన్ని అందించింది. సారంగి భజన్స్ బృందం నిర్వహించిన నామ సంకీర్తన భక్తులను భక్తిపారవశ్యంలో ముంచెత్తింది. కోటి దీపోత్సవంలో భాగంగా కొల్హాపూర్ మహాలక్ష్మి, మైసూరు చాముండేశ్వరి, వర్గల్ సరస్వతి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, గంధాలతో త్రిశక్తి పూజ నిర్వహించారు. భక్తులు చౌకీలపై సరస్వతి విగ్రహాలకు ప్రత్యేక అర్చనలు చేశారు. అలంపురం శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వరుల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉడుపి పెజావర్ మఠం పీఠాధిపతి శ్రీ విశ్వప్రసన్నతీర్థ స్వామీజీ అనుగ్రహ భాషణం భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రాంగణంలోని బంగారు శివలింగం వద్ద ఛైర్మన్‌తో పాటు 108 మంది భక్తులు పంచహారతులు సమర్పించారు. వివిధ వాహనాలపై ముగ్గురమ్మల ఊరేగింపు, నందివాహనంపై అలంపురం ఉత్సవమూర్తుల ఊరేగింపు భక్తులకు కనులపండువగా నిలిచాయి. పీఠాధిపతి అనుగ్రహ భాషణం, అతిథుల ప్రసంగాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

పీఠాధిపతి, అతిథులు, ఛైర్మన్ దంపతులు, భక్తులచే సామూహిక కార్తీక దీపారాధన నిర్వహించారు. అనంతరం సప్తహారతి, మహానీరాజనం సమర్పించారు. పీఠాధిపతులకు గురువందనం చేసి, అతిథులను ఘనంగా సత్కరించారు. రమణి బృందం ప్రదర్శించిన సింహనందిని నృత్యం, నరసాపురం అనంతలక్ష్మీ బృందం ఆదిపరాశక్తి నృత్యనికేతన్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఆదిపరాశక్తి వైభవ నృత్యం భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విజయవాడకు చెందిన రాజేశ్వరి బృందం ప్రదర్శించిన కరగటం నృత్యం, కోలాట కదంబం కార్యక్రమాలు వేడుకలకు మరింత శోభను చేకూర్చాయి.