Addam News
Newspaper Banner
Date of Publish : 16 November 2026, 6:34 am Posted by : Addam News

అంగ‌రంగంగా తిరుచెందూరు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య కల్యాణం

హైద‌రాబాద్‌,  ( అద్దం న్యూస్ ) :    హైదరాబాద్‌లో కోటి దీపోత్సవంలో భాగంగా రెండవ‌ రోజు అయిన ఆదివారం కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి. శంఖారావం, వేదపఠనంతో ప్రారంభమైన ఉత్సవాల్లో మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. అనంతరం ప్రతిమ బృందం భక్తిగీతాలు ఆలపించగా, డాక్ట‌ర్‌.తాడేపల్లి పతంజలి శాస్త్రి ప్రవచనం భక్తులకు ఆధ్యాత్మిక సందేశాన్ని అందించింది. శివశ్రీ స్కందప్రసాద్ భజన గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా సుబ్రహ్మణ్య వేలాయుధ కావడి పూజ ఘనంగా నిర్వహించారు. ప్రాంగణంలో భక్తులు సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలకు పుష్పార్చన చేశారు. అనంతరం తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కల్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణ సంకల్పంలో భాగంగా ఛైర్మన్ దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రాలయ పీఠాధిపతి శ్రీ సుబుదీంద్రతీర్థ స్వామివారు, రాజస్థాన్ హరికృపాధాం పీఠాధిపతి హరిచైతన్యపురి మహారాజ్ విచ్చేశారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.సురేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

          ఈ సందర్భంగా మంత్రాలయ పీఠాధిపతి శ్రీ రాఘవేంద్రస్వామి మహాపూజ నిర్వహించారు. కోటి దీపోత్సవంలో మరో విశేష ఘట్టంగా ప్రాంగణంలోని బంగారు శివలింగం వద్ద 108 మందితో పంచహారతులు నిర్వహించారు. అనంతరం పల్లకిపై తిరుచెందూరు ఉత్సవమూర్తుల ఊరేగింపు కనులపండువగా సాగింది. మంత్రాలయ పీఠాధిపతి శ్రీ సుబుదీంద్రతీర్థ స్వామివారు, హరికృపాధాం పీఠాధిపతి హరిచైతన్యపురి మహారాజ్ అనుగ్రహభాషణం చేశారు.

  ముఖ్య అతిథి జస్టిస్ కె.సురేందర్ ప్రసంగించారు. పీఠాధిపతులు, అతిథులు, ఛైర్మన్ దంపతుల ఆధ్వర్యంలో కార్తిక దీపారాధన నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో సామూహిక కార్తిక దీపారాధనలో పాల్గొని దీపాలు వెలిగించారు. అనంతరం లింగోద్భవం, సప్తహారతి, మహానీరాజనం కార్యక్రమాలు భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి లోను చేశాయి. పీఠాధిపతికి గురువందనం సమర్పించారు.