Addam News
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 7:28 am Posted by : Addam News

భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో తులసీ దామోదర కల్యాణోత్సవం

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 21, ( అద్దం న్యూస్ ) :    హైదరాబాద్ ఎన్‌టిఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం 2026 ఎనిమిదో ( శ‌నివారం ) రోజు కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో ఘనంగా జ‌రిగాయి. ప్రదోషకాల అభిషేకం, వివిధ దేవతామూర్తుల విశేష పూజలు, తులసీ దామోదర కల్యాణోత్సవం, సామూహిక కార్తీక దీపారాధన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రారంభంలో శంఖారావం, వేదపఠనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు. బాలత్రిపురసుందరిదేవి అలంకారంలో దుర్గమ్మ హారతి దర్శనం భక్తులకు కనులవిందు చేసింది. కొల్హాపూర్ మహాలక్ష్మీ ఆగమనం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పద్మప్రియ బృందం భక్తిగీతాలు, రామదాసు సంగీత కళాశాలకు చెందిన జయలక్ష్మి బృందం వీణా వాయిద్య ప్రదర్శన భక్తులను ఆధ్యాత్మిక ఆనందంలో ముంచెత్తాయి. డి.హయగ్రీవాచార్యులు ప్రవచనం భక్తులకు భక్తి సందేశాన్ని అందించింది. వేదికపై ఉజ్జయిని మహాకాళేశ్వర అభిషేకం నిర్వహించగా, నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి నృసింహ రక్షా కంకణ పూజ చేపట్టారు. అనంతరం తులసీ దామోదర కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు బెంగళూరు కైలాస ఆశ్రమ జయేంద్రపురి స్వామీజీ విచ్చేయగా, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఉజ్జయిని మహాకాళేశ్వర భస్మహారతి, ప్రాంగణంలోని బంగారు శివలింగం వద్ద ఛైర్మన్‌తో పాటు 108 మందిచే నిర్వహించిన పంచహారతులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పల్లకిపై తులసీ దామోదరుల ఊరేగింపు భక్తుల జయజయధ్వానాల మధ్య సాగింది. స్వామీజీ అనుగ్రహభాషణం, కేంద్ర మంత్రి అతిథి ప్రసంగం అనంతరం స్వామీజీ, ముఖ్య అతిథి, ఛైర్మన్ దంపతులతో పాటు భక్తులు సామూహికంగా కార్తీక దీపారాధన నిర్వహించారు.
సప్తహారతి, మహానీరాజనం, గురువందనం, అతిథి సత్కార కార్యక్రమాలు భక్తి వాతావరణంలో జరిగాయి. త్రైలోక్య ఆర్ట్స్ అకాడమీ బృందం కూచిపూడి నృత్యం, అంజనీ ప్రణవి బృందం దీపఘట నృత్యం, విజయవాడకు చెందిన రాయన శ్రీనివాస్ బృందం శివ కైవారం, కోలాట కదంబం భక్తులను అలరించాయి.