Addam News
Newspaper Banner
Date of Publish : 12 November 2026, 2:03 am Posted by : Addam News

ఎల్ నినో, వేసవి తాగునీటి అవసరాల కోసం ప్రత్యామ్నాయ జలవనరులపై జలమండలి దృష్టి

 ఎల్‌నినో ప్రభావం, రాబోయే వేసవి పరిస్థితుల నేపథ్యంలో ముందస్తు చర్యలు
# సింగూరు-మంజీరా జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వల దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి
# జంట జలాశయాల నుంచి అదనపు తాగునీటి సరఫరా అవకాశాల పరిశీలన
# ప్రత్యామ్నాయ మార్గాలు, పైప్‌లైన్ అనుసంధానంపై క్షేత్రస్థాయి పరిశీలన
– గండిపేటలో పర్యటించిన జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, ఉన్నతాధికారుల బృందం

హైద‌రాబాద్ బ్యూరో, న‌వంబ‌ర్ 11, ( అద్దం న్యూస్ ) :    ఎల్‌నినో ప్రభావం.. రాబోయే వేసవిలో తాగునీటి సరఫరాలో తలెత్తే అవకాశం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మహానగరానికి తాగునీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా జలమండలి ముందస్తు చర్యలను ముమ్మరం చేస్తోంది. ముఖ్యంగా నగరానికి ప్రధాన జలవనరులైన సింగూరు–మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ జలవనరుల వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కె.అశోక్ రెడ్డి బుధవారం ఉన్నతాధికారుల బృందంతో కలిసి గండిపేటతో పాటు పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల నుంచి నగరానికి అదనపు తాగునీటిని సరఫరా చేసే సాధ్యాసాధ్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా రాబోయే ఫిబ్రవరి, మార్చి నెలల్లో పెరిగే తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని, జంట జలాశయాల నుంచి అదనంగా ఎంత నీటిని సేకరించవచ్చు, ఏ మార్గాల్లో తరలించవచ్చు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న పైప్‌లైన్ వ్యవస్థతో ఎలా అనుసంధానం చేయవచ్చనే అంశాలపై అధికారులతో చర్చించారు.

అదనపు నీటి తరలింపునకు అవసరమైన మౌలిక సదుపాయాలు, ప్రత్యామ్నాయ పైప్‌లైన్ మార్గాలు, భవిష్యత్ విస్తరణ అవకాశాలను పరిశీలించారు. నీటి లభ్యత, సాంకేతిక సాధ్యాసాధ్యాలు, సరఫరా వ్యవస్థ సామర్థ్యాన్ని సమగ్రంగా అంచనా వేసిన అనంతరం తదుపరి కార్యాచరణను రూపొందించనున్నారు. రాబోయే వేసవిలో తాగునీటి డిమాండ్ పెరిగే అవకాశాలున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న ప్రతి జలవనరును సమర్థంగా వినియోగించుకునే అవకాశాలను పరిశీలించాలని ఎండీ అధికారులకు సూచించారు. ముఖ్యంగా సింగూరు–మంజీరా జలవనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ సరఫరా మార్గాల సాధ్యాసాధ్యాలపై దృష్టి సారించాలని ఆదేశించారు. నగర ప్రజలకు తాగునీటి సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా అన్ని అవకాశాలను పరిశీలిస్తూ, ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపడుతున్నట్లు జలమండలి వెల్లడించింది. ఈ కార్యక్రమంలో జలమండలి ప్రాజెక్ట్స్ డైరెక్టర్ మహేష్ కుమార్, సీఈఓ రాంబాబుతో పాటు ప్రాజెక్టు, ట్రాన్స్‌మిషన్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.