వినాయక నిమజ్జనానికి జలమండలి విస్తృత ఏర్పాట్లు
భక్తుల కోసం 137 ప్రత్యేక తాగునీటి శిబిరాలు
90 బేబీ పాండ్స్ వద్ద కూడా తాగునీటి సదుపాయం
72 గంటలు అప్రమత్తంగా ఉండాలి – ఎండీ అశోక్ రెడ్డి
హైదరాబాద్ బ్యూరో, సెప్టెంబర్ 24, ( అద్దం న్యూస్ ) : వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీటి సరఫరాతో పాటు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో ఈడీలు, డైరెక్టర్లు, సీజీఎంలు, జీఎంలతో గురువారం ఆయన అధికారులకు ఆదేశించారు. భక్తుల దాహార్తిని తీర్చేందుకు నగరంతో పాటు జలమండలి మూడు రీజియన్ల పరిధిలో ( ఓఆర్ఆర్ వరకు ) గా 137 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎండీ తెలిపారు. అదే విధంగా నిమజ్జనాల కోసం ఏర్పాటు చేసిన 90 బేబీ పాండ్స్ వద్ద కూడా తాగునీటి క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గణేష్ శోభాయాత్ర జరిగే ప్రధాన మార్గాలతో పాటు ట్యాంక్‌బండ్, డాక్టర్.బీఆర్.అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం, పరిసర ప్రాంతాల్లో 12 ప్రత్యేక వాటర్ క్యాంపులు అందుబాటులో ఉంటాయన్నారు. ఇందుకోసం మొత్తం 40 లక్షల వాటర్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచుతున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 3, 5, 7, 9వ రోజుల నిమజ్జనాల సందర్భంగా ఓఆర్ఆర్ పరిధిలోని నిమజ్జన కొలనుల వద్ద జలమండలి తాగునీటి శిబిరాలను నిర్వహించింది. అవసరమైన ప్రాంతాల్లో డ్రమ్ముల ద్వారా కూడా మంచినీటిని అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

రీజియన్లలో ఆయా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పర్యవేక్షణ
నోడల్, రూట్ అధికారుల నియామకం :
వినాయక నిమజ్జనం సందర్భంగా ఏర్పాటు చేసిన తాగునీటి శిబిరాల నిర్వహణ, పర్యవేక్షణతో పాటు క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు నోడల్ అధికారులను నియమించినట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏరియాకు ప్రత్యేకంగా రూట్ అధికారులను నియమించామని పేర్కొన్నారు. జలమండలి పరిధిలోని మూడు రీజియన్లలో ఆయా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ( ఈడీలు ) తమ పరిధిలోని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నోడల్, రూట్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించారు. శోభాయాత్ర జరిగే మార్గాల్లో వాటర్ లీకేజీలు, సీవరేజీ ఓవర్‌ఫ్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సీవర్ జెట్టింగ్ యంత్రాలను సిద్ధంగా ఉంచాలని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. పోలీసు, జీహెచ్ఎంసీ, హైడ్రా, ఉత్సవ కమిటీలతో సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నగర వ్యాప్తంగా ఏర్పాటు చేసే అన్నదాన శిబిరాలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా ఉచితంగా నీటిని సరఫరా చేయనున్నారు. జలమండలి క్వాలిటీ అస్యూరెన్స్ టీమ్‌లు ( QAT ) వాటర్ క్యాంపుల్లో తాగునీటి నాణ్యతను నిరంతరం పరిశీలించడంతో పాటు క్లోరిన్ స్థాయిలు నిర్ణీత మోతాదులో ఉండేలా పర్యవేక్షిస్తాయి. భక్తుల రద్దీ ఎంత ఉన్నా తాగునీటికి ఇబ్బంది తలెత్తకుండా, శోభాయాత్ర మార్గాల్లో వాటర్ లీకేజీలు, సీవరేజీ ఓవర్‌ఫ్లోలకు తావులేకుండా అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా పనిచేయాలని ఎండీ అశోక్ రెడ్డి స్పష్టం చేశారు.