స్వాతంత్య్ర స్ఫూర్తిని కాపాడుకోవాలి
మతం పేరుతో ప్రజలను విభజించే కుట్రలను తిప్పికొట్టాలి
» డాక్టర్ దిడ్డి సుధాకర్
హైదరాబాద్, ఆగస్టు 15, ( అద్దం న్యూస్ ) : భారతదేశం 80 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సూర్యనగర్ బస్తీలో బస్తీవాసుల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారత శాంతి, సంఘీభావ సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దిడ్డి సుధాకర్ హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ… దేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తయినా, ప్రజలు ఇంకా తమ ప్రాథమిక సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కొనసాగుతోందని అన్నారు. వర్షాల కోసం ప్రజలు దేవుడిని ప్రార్థించాల్సిన పరిస్థితి ఉండటం, శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం సాధించిన పురోగతికి విరుద్ధంగా ఉందన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం హిందువులు, ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులు, జైనులు, ఇతర అన్ని మతాలు, వర్గాలకు చెందిన ప్రజలు భుజం భుజం కలిపి పోరాడారని గుర్తు చేశారు. మతం, కులం, ప్రాంతం, దేశభక్తి పేరుతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించి చిచ్చుపెట్టే ప్రయత్నాలను ప్రజలు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ నేతృత్వంలో రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం దేశ ప్రజలకు సమానత్వం, స్వేచ్ఛ, సామాజిక న్యాయం, హక్కులను కల్పించిందని డాక్టర్ సుధాకర్ అన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకోవడం, రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని స్పష్టం చేశారు.
ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి యువత, విద్యార్థులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు విద్యావంతులైన యువతరం నాయకత్వ బాధ్యతలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. యువత కేవలం ప్రేక్షకులుగా ఉండకూడదు… దేశ భవిష్యత్తును నిర్మించే శక్తిగా మారాలని డాక్టర్ సుధాకర్ అన్నారు. పాలకులు చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాడాలని సూచించారు. దేశ అభివృద్ధి శాస్త్రీయ దృక్పథంతోనే సాధ్యమవుతుందని, సైన్స్, టెక్నాలజీ, విద్య, పరిశోధన రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచంలో భారత్ మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. స్వాతంత్య్ర సమరయోధులు కలలుగన్న ఐక్య, లౌకిక, ప్రజాస్వామ్య, సామాజిక న్యాయ భారతదేశాన్ని నిర్మించడమే 80 వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మనమందరం తీసుకోవాల్సిన ప్రతిజ్ఞ అని డాక్టర్ సుధాకర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జె.సురేందర్, రాకేష్ సింగ్, పప్పు రాజేందర్, ఉషారాణి, నిర్మల, మంజు, ప్రవీణ్, గోపి, మాంటీ, భూపేష్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png