హైదరాబాద్, నవంబర్ 18, ( అద్దం న్యూస్ ) : అర్హులైన ప్రతి ఒక్కరికీ రాజకీయాలకు అతీతంగా చేయూత పింఛన్లు అందిస్తామని రాజ్యసభ సభ్యుడు మందడి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ముషీరాబాద్, హిమాయత్‌నగర్ తహసీల్దార్ కార్యాలయాల పరిధిలోని దాదాపు 4,000 మందికి నూతన చేయూత పింఛన్ల మంజూరు కాగా, బుధవారం 2,000 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేత కార్యక్రమం జరిగింది. ముషీరాబాద్ మహ్మదీయ ఫంక్షన్హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ లు హాజరై అడిషనల్ కలెక్టర్ జితేందర్ రెడ్డి, ముషీరాబాద్ ఇన్చార్జ్ తహశిల్థార్ చందన, హిమాయత్‌నగర్ తహశిల్థార్ సంధ్యారాణి లతో కలిసి పింఛన్ మంజూరు పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పాత సంక్షేమ పథకాలన్నింటినీ కొనసాగిస్తూనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
మహిళా సంఘాల ఆర్థిక అభివృద్ధికి రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు రూ.79 వేల కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత, ఆర్థిక భరోసా అందించడమే లక్ష్యంగా ఈ పెన్షన్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యతనిస్తూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాజిద్ హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ సికింద్రాబాద్ డిసిసి ప్రధాన కార్యదర్శి మారిశెట్టి నర్సింగ్‌రావు, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సంగపాక వెంకట్, బాగ్‌లింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు నవీన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు జయకుమార్, సంగపాక భాస్కర్, అతినగరం సుధేష్, రెవెన్యూ అధికారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కొండ శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
