Addam News
Newspaper Banner
Date of Publish : 30 October 2026, 1:24 am Posted by : Addam News

8500 కోట్ల రూపాయ‌ల‌ ఫీజుల బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారు ? రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య

   ప్రభుత్వానికి విద్యార్ధుల ఆర్తనాదాలు వినిపించడం లేదా !
– కోర్సు పూర్తి చేసిన 6 లక్షల మంది విద్యార్ధుల సర్టిఫికెట్లను ఇప్పించాలి
– వంద‌లాది మంది విద్యార్ధుల భారీ ప్రదర్శన

 న‌ల్ల‌కుంట‌, అక్టోబర్ 29, ( అద్దం న్యూస్ ) :    ఎలాంటి షరతులు లేకుండా ఫీజుల బకాయిలు, స్కాలర్‌షిప్‌ల‌కు సంబంధించిన 8,500 వేల కోట్ల రూపాయ‌ల‌ను వెంటనే చెల్లించాలని, పాత పద్ధతి ప్రకారం ఫీజుల స్కీంను కొనసాగించాలని రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య డిమాండ్ చేశారు. కోర్సు పూర్తి చేసిన 6 లక్షల మంది విద్యార్ధులకు సర్టిఫికెట్లు లేక విలవిలలాడుతున్నారు. ప్రభుత్వానికి విద్యార్ధుల ఆర్తనాదాలు వినిపించడం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాలేజీలలో చదువుతున్న 14 లక్షల మంది విద్యార్ధుల ఫీజుల బకాయిలు 8500 కోట్ల రూపాయ‌ల‌ను చెల్లించాల‌ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బిసి విద్యార్ధుల సంఘం కన్వీనర్ పర్లగోర్ల మోడీరాందేవ్ యాదవ్ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ శంక‌ర్ మ‌ఠ్ వ‌ద్ద విద్యార్థుల‌తో క‌లిసి భారీ ప్ర‌ద‌ర్శ‌న జ‌రిగింది. ఈ ప్ర‌ద‌ర్శ‌న‌కు మ‌ద్ద‌తుగా రాజ్య‌సభ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆర్‌.కృష్ణ‌య్య మాట్లాడుతూ… ముఖ్యమంత్రి బడ్జెటు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించారు… కానీ ఇంత వరకు బ‌డ్జెట్‌ను విడుదల చేయలేదని విమ‌ర్శించారు. బడ్జెటు విడుదల చేయకపోవడంతో విద్యార్ధులు నరకయాతన అనుభావిస్తున్నార‌న్నారు. ఫీజులు మంజూరు చేసిన తరువాత ప్రభుత్వమే ప్రతి విద్యార్ధికి మెస్సేజ్ పెట్టాలని, రైతు బందు రైతులకు మంజూరు చేసినట్లు విద్యార్ధులకు వారికి మంజూరైనా వివరాలు ప్రతి విద్యార్ధికి మెస్సేజ్ ఇవ్వాలన్నారు. పైగా ఇంకా చాల మంది విద్యార్ధులు ఫీజులు చెల్లించకపోవడంతో సర్టిఫికెట్లు కాలేజిలలోనే ఉన్నాయ‌ని, కొందరు అప్పులు చేసి తీసుకున్న మంజూరు చేసిన తర్వాత మెస్సేజ్ చూసిన తర్వాత వచ్చి కాలేజీలలో వసూలు చేసుకుంటారన్నారు.

విద్యార్థులు ఫీజులు కట్టే స్తోమత లేని వారి కోసం ఈ స్కీమును పెట్టించాం, స్కీముపై ఆధారపడి ఉచిత విద్య లభిస్తుందని చదువుకోవడానికి లక్షలాది మంది ఉన్న విద్యా కోర్సులు చదవడానికి ముందుకు వస్తున్నారని కృష్ణ‌య్య తెలిపారు. ఈ ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు అష్ట కష్టాల పాలవుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇకా ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ అధికారులు మహిళ యూనివర్సిటీ అధికారులు కూడా విద్యార్థుల వద్ద ఫీజులు కట్టేవరకు అడ్మిషన్లు ఇవ్వడం లేదన్నారు. సర్టిఫికెట్లు విద్యార్థులకు ఆపవద్దని ఒకవైపు ప్రభుత్వ ఉత్తర్వులు – హైకోర్టు – సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయ‌న్నారు. కానీ కాలేజీలో వాటిని ధిక్కరించి విద్యార్థులను వేధిస్తున్నారని విమ‌ర్శించారు. ప్రైవేటు డిగ్రీ, జూనియర్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ కాలేజీలో కోర్సులు పూర్తిచేసిన 6 లక్షల మందికి కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీ కాలేజిలు, ప్రైవేట్ కాలేజీలు కుడా సర్టిఫికెట్లను ఇవ్వడంలేదన్నారు. స్కాల‌ర్‌షిప్‌లు, ఫీజుల రీయంబ‌ర్స్‌మెంట్ బ‌డ్జెట్ లేద‌ని, అందుకే చెల్లించ‌డంలేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌దే ప‌దే అన‌డం స‌రికాద‌న్నారు.

అన్ని స్కీములకు బడ్జెట్ ఉంటుంది కానీ, చదువకునే విద్యార్థులకు స్కాల‌ర్‌షిప్‌లకు, ఫీజులకు బడ్జెట్ లేదా అని.. ఇది సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 34 నెలలు గడుస్తుందన్నారు. 34 నెలల కాలంలో ఏడు లక్షల కోట్లు ప్రభుత్వ ఆదాయం పన్నుల రూపంలో, భూముల అమ్మకాల వలన కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ల నుంచి ప్రభుత్వానికి వచ్చాయన్నారు. అలాగే వివిధ బ్యాంకుల నుంచి ఇతర సంస్థల నుంచి 4 లక్షల కోట్లు తెచ్చారని… దాదాపు 11 లక్షల కోట్లు ఆదాయం వస్తే చదువుకునే విద్యార్థులకు 8 వేల కోట్ల రూపాయలు స్కాలర్‌షిప్‌లు, ఫీజులు ఇవ్వడానికి డబ్బులు లేవా ? అని కృష్ణ‌య్య ప్ర‌శ్నించారు. ఒక్కొక్క కాంట్రాక్టర్లకు ప్రభుత్వం పనులు చేసిన వారికి వేల కోట్లు పాత బకాయిలు చెల్లించారు.. కానీ 14 లక్షల మంది చదువుకునే విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఫీజులు చెల్లించడానికి డబ్బు లేదా ? ఇది అన్యాయం కాదా ? అని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల వాగ్దాన ప్రకారం కాలేజీ కోర్సులు చదివే విద్యార్థుల ఫీజులు పూర్తిగా చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలేజీ కోర్సులు చదివే విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల‌ను ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ప్రతి విద్యార్థికి 5 వేల నుంచి 20 వేలకు పెంచాలన్నారు. ఈ భారీ ప్రదర్శనలో బిసి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జిల్లపల్లి అంజి, బీసీ సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలా వెంకటేష్, బిసి విద్యార్ధి సంఘం రాష్ట్ర కన్వీనర్ నిఖిల్ పటేల్, అల్లం యాదయ్య, సుద్దగొని నరేష్ గౌడ్, రామాంజనేయులు, కిరణ్, రఘుపతి, వంశీ, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.