Addam News
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 4:08 am Posted by : Addam News

నీటి పొదుపుపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలి – సైబరాబాద్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం

కూకట్‌పల్లి, అక్టోబర్ 26, ( అద్దం న్యూస్ ) :      నీటి పొదుపు, పునర్వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు జలమండలి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సోమవారం సైబరాబాద్ రీజియన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి పరిధిలో జల సంరక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ సేవ్ వాటర్ – రీయూజ్ వాటర్ ’ ప్రచార పోస్టర్లను విడుదల చేసి, క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించేందుకు లైన్‌మెన్లకు అనౌన్స్‌మెంట్ పరికరాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంతోష్ మాట్లాడుతూ.. రానున్న వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించాలని సూచించారు. ప్రతి ఇంట్లో కనీసం 20 శాతం నీటి వినియోగాన్ని తగ్గించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. లైన్‌మెన్లు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం విధి నిర్వహణ సమయంలో నీటి పొదుపు, పునర్వినియోగంపై అనౌన్స్‌మెంట్ల ద్వారా ప్రజలను చైతన్యపరచాలన్నారు. పైపులైన్లు, కుళాయిల లీకేజీలను గుర్తించి తక్షణమే అరికట్టాలని సూచించారు. వాహనాలు కడగడం, ఇళ్లను శుభ్రం చేయడం వంటి పనులకు పైపుల ద్వారా నీటిని వృథా చేయకుండా బకెట్లను వినియోగించాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తాగునీరు అవసరం లేని పనులకు శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ నారాయణ, కూకట్‌పల్లి జనరల్ మేనేజర్, డీజీఎంలు, మేనేజర్లు, లైన్‌మెన్లు పాల్గొన్నారు.