Addam News
Newspaper Banner
Date of Publish : 22 November 2026, 6:53 am Posted by : Addam News

రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళా సాధికారత, ఆర్థిక భద్రత – సికింద్రాబాద్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి మారిశెట్టి నర్సింగరావు

గాంధీన‌గ‌ర్‌, న‌వంబ‌ర్ 21, ( అద్దం న్యూస్ ) :

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం ప్రజల సంక్షేమం, ఆర్థిక భద్రత, మహిళా సాధికారత, విద్య, వైద్యం వంటి రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని సికింద్రాబాద్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి మారిశెట్టి నర్సింగరావు తెలిపారు. హైద‌రాబాద్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలో రేషన్ కార్డుదారులందరికీ ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై అవగాహన కార్యక్రమాన్ని జిహెచ్ఎంసి స‌ర్కిల్‌-40 డిప్యూటీ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ పుష్ప‌ల‌త‌ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… అర్హులైన లబ్ధిదారులందరికీ నమోదు చేసుకునే అవకాశం కల్పించి, ప్రభుత్వ పథకం ద్వారా అందాల్సిన ప్రయోజనాలను పొందేలా చూస్తామ‌న్నారు. నమోదు ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించాలని, దరఖాస్తుదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా, సమర్థవంతంగా నమోదు ప్రక్రియను పూర్తి చేస్తామ‌న్నారు. సికింద్రాబాద్ జిల్లా డీసీసీ ప్రధాన కార్యదర్శి మారిశెట్టి నర్సింగరావు మాట్లాడుతూ… ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ప‌థ‌కాన్ని అర్హులంద‌రూ స‌ద్వినియోగం చేసుకోవాల‌ని అన్నారు.

        బీమా పొందిన వ్యక్తి మరణిస్తే ( సహజ లేదా ప్రమాదవశాత్తు ), నామినీలకు రూ.5 లక్షల పరిహారం అందుతుందన్నారు. లబ్ధిదారులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని, పూర్తి ప్రీమియం మొత్తాన్ని తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు బాబూరావు, మార్టిన్, రాజు, టాక్స్ ఇన్‌స్పెక్టర్ కిషన్, నోడల్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి, సూపర్‌వైజర్లు రాజ్‌కుమార్, వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.