Addam News
Newspaper Banner
Date of Publish : 22 June 2026, 3:42 am Posted by : Addam News

జీవన వేతనం కై శ్రామిక మహిళలు సంఘటితంగా పోరాడాలి

జీవన వేతనం కై శ్రామిక మహిళలు సంఘటితంగా పోరాడాలి

హైద‌రాబాద్‌, జూన్ 21, ( అద్దం న్యూస్ ) :  జీవన వేతనం, సమాన వేతనాలకై, పనిస్థలాల్లో పితృస్వామిక భావజాలానికి వ్యతిరేకంగా శ్రామిక మహిళలు సంఘటితంగా పోరాడాలని పిఓడబ్ల్యూ జాతీయ నాయకురాలు రమాసుందరి పిలుపునిచ్చారు. IFTU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ విద్యాన‌గ‌ర్ మార్క్స్ భ‌వ‌న్‌ ఇప్టూ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన శ్రామిక మహిళా వర్క్ షాప్‌లో ” శ్రామిక పోరాటాలు ” అనే అంశంపై ఆమె మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, లైంగిక దోపిడీ, అణిచివేత, వివక్షలకు వ్యతిరేకంగా శ్రామిక మహిళలు సంఘటితంగా జాతీయంగానూ అంతర్జాతీయంగానూ అనేక సమరశీల పోరాటాలు నిర్వహించారన్నారు. ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం, ఎలాన్ మాస్క్, నారాయణమూర్తి లాంటి ప్రపంచ కుబేరులు శ్రామిక మహిళల శ్రమశక్తి కారుచౌకగా దోచుకోవడానికి పాలకుల చేత తమకు అనుకూలమైన చట్టాలను రూపొందింపజేసి అమలు చేయించుకుంటున్నారని తెలిపారు. ఈ క్లాస్‌కు ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షులు జి.అనురాధ అధ్యక్ష వహించారు.

పిఓడబ్ల్యు జాతీయ నాయకురాలు ఝాన్సీ మాట్లాడుతూ… కుటుంబంలోనూ సమాజంలోనూ పురుషాధిపత్యం కొనసాగుతుందని, అన్ని దశల్లోనూ శ్రామికమహిళలు పురుషులపై ఆధారపడే విధంగా దిగజార్చారని ఆవేదన చెందారు. ఈ క్లాస్‌కు ఐఎన్‌టియు రాష్ట్ర నాయకులు జి.పద్మ అధ్యక్షత వహించారు. పిఓడబ్ల్యు జాతీయ నాయకురాలు వి.సంధ్య మాట్లాడుతూ… కార్మికరంగంలో శ్రామిక మహిళలు నాయకత్వ శ్రేణిగా ఎదగడానికి అంకితభావంతో, నిబద్ధతతో కృషి చేయాలని తెలిపారు. ఈ క్లాస్‌కు ఐఎఫ్‌టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అరుణ అధ్యక్షత వహించారు. శ్రామిక మహిళ వర్క్ షాప్ ప్రారంభానికి ముందు IFTU పతాకాన్ని జాతీయ నాయకురాలు అరుణ ఆవిష్కరించగా, అమరవీరులకు సంతాప తీర్మానంతో ప్రారంభమైన ఈ వర్క్ షాప్‌లో ఐఎఫ్‌టియు జాతీయ నాయకురాలు అరుణ ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా కార్మిక రంగంలో పనిచేసే శ్రామిక మహిళా కార్యకర్తలు స్వతంత్రంగా వర్క్ స్కిల్క్స్‌, సమస్యల అధ్యయనం, డిమాండ్ల రూపకల్పన, కార్యక్రమాలను రూపొందించుకోవడం వంటి అంశాలపై చర్చగోష్టులు నిర్వహించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png