Addam News
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 5:11 am Posted by : Addam News

యువ‌త డ్ర‌గ్స్‌కు దూరంగా ఉండి క్రీడ‌లు, వ్యాయామం, సైక్లింగ్‌ల‌ను అల‌వాటు చేసుకోవాలి – రాజ్యసభ స‌భ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్

హైద‌రాబాద్‌, అక్టోబర్ 25, ( అద్దం న్యూస్ ) :     యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ క్రీడలు, వ్యాయామం, సైక్లింగ్ వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవరచుకోవాలని రాజ్యసభ స‌భ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల రహిత భారతదేశ నిర్మాణమే లక్ష్యంగా, యువతలో డ్రగ్స్‌పై అవగాహన కల్పించేందుకు హైద‌రాబాద్‌ ముషీరాబాద్ అసెంబ్లీ పరిధిలో అక్షర స్పూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన నశాముక్త్ భారత్ సైకిల్ ర్యాలీ జ‌రిగింది. ఆదివారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్ సమీపంలో ప్రారంభమైన ఈ సైకిల్ ర్యాలీ దాదాపు 8 కిలోమీటర్లు కొనసాగి అశోక్‌న‌గ‌ర్‌ చౌరస్తా వద్ద ముగిసింది. డాక్టర్ కె.లక్ష్మణ్ స్వయంగా సైకిల్ తొక్కుతూ యువతకు ఆరోగ్యకరమైన జీవనశైలి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.

మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా పోరాడుతామని, యువతలో అవగాహన కల్పిస్తూ నశాముక్త్ భారత్ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్‌.కె.ల‌క్ష్మ‌ణ్ మాట్లాడుతూ… మాదకద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తును, కుటుంబాల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కుటుంబాలు, విద్యాసంస్థలు, సామాజిక సంస్థలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. యువత ఆరోగ్యంగా, బాధ్యతాయుతంగా ఎదిగినప్పుడే దేశ భవిష్యత్తు మరింత బలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిజెపి నాయ‌కులు భ‌ర‌త్‌గౌడ్, రాహుల్‌, ర‌త్న సాయిచంద్‌, గ‌డ్డం న‌వీన్‌, బొల్లంప‌ల్లి రాంరెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.