మహిళలకు 33 శాతం వాటా అనేది దేశాభివృద్ధిలో కీలకమైన మైలురాయి
– రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి శివ నాగేశ్వరరావు
హైదరాబాద్, మే 12, ( అద్దం న్యూస్ ) : మహిళలకు 33 శాతం వాటా అనేది దేశాభివృద్ధిలో కీలకమైన మైలురాయి అని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ( A ) జాతీయ కార్యదర్శి శివ నాగేశ్వరరావు అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన ‘ మహిళా రిజర్వేషన్ బిల్లు ‘కు మద్దతుగా, కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్‌లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి శివ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఒకరోజు ధర్నా జరిగింది. ఈ సందర్భంగా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ… భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకువచ్చిన చారిత్రాత్మక ‘ నారీ శక్తి వందన్ అధినియం ‘ (మహిళా రిజర్వేషన్ బిల్లు) పట్ల మా ‘ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) ‘ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తోందన్నారు. భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుకన్న మహిళా సాధికారతను నిజం చేస్తూ, ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ( NDA ) ప్రభుత్వం చారిత్రాత్మకమైన ‘ మహిళా రిజర్వేషన్ బిల్లు ‘ ను తీసుకురావడం జరిగిందన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ మోడీ తీసుకున్న ఈ నిర్ణయం దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామమన్నారు.
మహిళలకు ఇంతటి గొప్ప మేలు జరుగుతుంటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, వారి మిత్రపక్షాలు ఈ బిల్లు పట్ల వ్యవహరించిన తీరు, వారి వ్యతిరేక వైఖరి అత్యంత విచారకరమన్నారు. ఇది ఆ పార్టీకి మహిళల పట్ల ఉన్న చిత్తశుద్ధి లేమిని తెలియజేస్తోందని నాగేశ్వరరావు విమర్శించారు. ఈ నేపథ్యంలో, ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన మా ‘ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) ‘ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రివర్యులు రాందాస్ అథవాలే ఆదేశాల మేరకు మహాధర్నా నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, మహిళా బిల్లు పట్ల అవలంబించిన వ్యతిరేక విధానాలను అట్టడుగు వర్గాల ప్రజలకు, మహిళలకు తెలియజేయడమే లక్ష్యంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ నాయకులు డాక్టర్ సంఘం శ్రీధర్, రాష్ట్ర నాయకులు దాచారపు శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడ్డి రవికుమార్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఆర్పీ నీల, పొలిటికల్ ఉమెన్స్ అధ్యక్షురాలు గంగాపురం పద్మ, జగన్నాథం రాజిరెడ్డి, అసేంట్ ఓనర్ సెక్రెటరీ ఎన్ఆర్‌సి రాజు, ఏఐఆర్ఆర్టీ సెక్రెటరీ నర్సింగ్ రావు, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సాంబ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply