రెండు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఫుడ్ పాయిజ‌న్‌ — అస్వ‌స్థ‌త‌కు గురైన 69 మంది విద్యార్థులు

రెండు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఫుడ్ పాయిజ‌న్‌
» అస్వ‌స్థ‌త‌కు గురైన 69 మంది విద్యార్థులు

 హైదరాబాద్, డిసెంబ‌ర్ 12, అద్దం న్యూస్ : హైదరాబాద్ బాగ్‌లింగంప‌ల్లిలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 25 మంది విద్యార్థినులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. శుక్ర‌వారం గురుకుల పాఠ‌శాల‌లో ఉద‌యం ఉప్మా, 10:30 గంట‌ల‌కు స్నాక్స్ ను బాలిక‌లు తిన్నారు. 25 మంది విద్యార్థినులు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వాంతులు, తల తిరగడం, తీవ్రమైన అలసటతో విద్యార్థులు ఇబ్బంది ప‌డ్డారు. పరిస్థితిని గమనించిన పాఠశాల ప్రిన్సిపాల్‌ విషయం బయటకు రాకుండా ప్రయత్నించినప్పటికీ, విద్యార్థుల పరిస్థితి విషమించడంతో 25 మందిలో 16 మందిని కింగ్ కోఠి జిల్లా ఆసుపత్రికి తరలించగా, ఆరుగురిని నిలోఫ‌ర్‌కు త‌ర‌లించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, హాస్టల్‌ కిచెన్‌ పరిశుభ్రత, ఆహార నాణ్యతపై నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. సంబంధిత ఉన్న‌తాధికారుల దృష్టికి విషయం వెళ్లడంతో సంఘటనపై విచారణ ప్రారంభించినట్లు సమాచారం.

చందానాయ‌క్ తండా ప్రైమ‌రి స్కూల్‌లో 44 మంది విద్యార్థుల‌కు అస్వ‌స్థ‌త :

హైద‌రాబాద్ న‌గ‌రంలోని హైటెక్ సిటీ చందానాయ‌క్ తండాలోని ప్ర‌భుత్వ ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ఫుడ్ పాయిజ‌న్ అయి 44 మంది విద్యార్థులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. 138 మంది విద్యార్థులుండ‌గా శుక్ర‌వారం 107 మంది పిల్ల‌లు బ‌డికి వ‌చ్చారు. నిర్మాణ్ సంస్థ ఆధ్వ‌ర్యంలో టిఫిన్‌లో మైసూరు బొండా, చ‌ట్నీ, పాలు అందించారు. అలాగే మ‌ధ్యాహ్నం అక్ష‌య‌పాత్ర ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో అన్నం, ఆలు క‌ర్రీ, సేమియా స్వీట్, ప‌ప్పు పెట్టారు. మ‌ధ్యాహ్నం భోజ‌నం తిన్నాక త‌ర‌గ‌తి గ‌దుల‌కు వెళ్లిన విద్యార్థుల్లో 44 మంది విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. వారిలో 24 మంది బాలిక‌లుండ‌గా, 20 మంది బాలురులున్నారు. స‌మాచారం అందుకున్న ఉన్న‌తాధికారులు బాధిత విద్యార్థుల‌ను కొండాపూర్‌లోని జిల్లా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వారిలో సుభాష్‌, రాధిక‌, మ‌హేశ్వ‌రి, అక్ష‌య‌, శ్రీకృష్ణ‌, ప్ర‌భాస్ విద్యార్థులు ర‌క్త‌పు వాంతులు చేసుకోవ‌డంతో వారిని నాన‌క్‌రాంగూడ‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page