...

విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త

విద్యార్థులకు శుభవార్త..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ఇక నుంచి ప్రతి ఏటా అడ్వాన్స్‌గా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తాం
– సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ బ్యూరో, ఆగ‌స్టు 14, ( అద్దం న్యూస్ ) :  విద్యార్థులకు సీఎం రేవంత్‌రెడ్డి శుభవార్త వినిపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ఇకనుంచి ప్రతి ఏటా అడ్వాన్స్‌గా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేకుండా, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి డబ్బులను ముందుగానే వారి ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. హైద‌రాబాద్ నెక్లెస్ రోడ్ హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించి ఆ మహనీయులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, అజరుద్దీన్, సలహాదారులు కె.కేశవ రావు, వి.హనుమంత రావు, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… ఫీజులు కట్టలేదని, యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఆపడానికి వీలులేదని.. విద్యార్థులు అడక్కుండానే వారి ఖాతాలో డబ్బులు వేస్తామ‌న్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుంచి ముందస్తుగా బ్యాంకు ఖాతాల్లో సిద్ధంగా పెడుతున్నామ‌ని, ఈ విధానాన్ని ప్రక్షాళన చేసి, ప్రతి ఏటా రూ.2,400 కోట్లు విద్యార్థుల ఖాతాల్లో వేసి ఈ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలని కోరారు. 

ఒకప్పుడు ఇంజనీరింగ్, డాక్టర్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగాలు వచ్చేవి.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. స్కిల్స్‌ ఉంటే ఉద్యోగాలు వస్తాయి… అందుకే నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్య, ఆ తర్వాత స్కిల్స్ నేర్పాలన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న వారికి ఈ సమాజం రెడ్ కార్పెట్ పరుస్తుందని, కేవలం సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వస్తుందో రాదో.. చెప్పలేం అని పేర్కొన్నారు. ప్రభుత్వం సాంకేతిక నైపుణ్యం కోసం సంపూర్ణమైన అవగాహనతో ముందుకు వెళ్తున్నదని… ఏటీసీలు, పాలిటెక్నిక్, స్కిల్స్ యూనివర్సిటీ.. ఇతర సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోండి. ఆడపిల్లలు నర్సింగ్ చదువుకుంటే రూ.2 లక్షలతో జపాన్, సౌత్ కొరియా లాంటి దేశాల్లో ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయన్నారు. ఇప్పుడు చదువుల్లో పోటీ పెరిగిందని.. చాలా మందికి 90 శాతం పైగా మార్కులు వస్తున్నాయని, చదువు మాత్రమే కాదన్నారు. సాంకేతిక నైపుణ్యంలో రాణించే వారూ ఉంటారపి.. కొందరు క్రీడల్లో రాణించే వారుంటారన్నారు. మట్టిలో మాణిక్యాలు ఉంటాయని పేర్కొన్నారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కోటి రూపాయల నగదు బహుమతిని అందిస్తామని ముఖ్యమంత్రి బాక్సింగ్ చాంపియన్ కు నిఖత్ జరీన్, సిరాజ్, దీప్తీ దివాంజీలను ఉదహరించారు.

సాంకేతిక నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ చదువుకుంటే అమెరికాలో ఉద్యోగం వచ్చేదని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని పేర్కొన్నారు. ఏఐ వల్ల ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, ఐటీ నిపుణుల ఉద్యోగాలు కూడా పోయే ప్రమాదం తలెత్తిందని… ఏ విధంగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవాలో మనం ఆలోచన చేయాల్సిన అవసరముందని తెలిపారు. కులాల మధ్య అంతరాలను తగ్గించడానికి అన్ని వర్గాలు ఒకే చోట కలిసిమెలిసి జీవించడమనే లక్ష్యంతో రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విధానం ద్వారా విప్లవాత్మకమైన మార్పులు చేస్తున్నామ‌ని చెప్పారు. జ్యోతీరావు పూలే, సావిత్రీబాయి పూలే లాంటి మహనీయుల జీవిత విశేషాలను వివరిస్తూ విగ్రహాలు చేయడం ఏర్పాటు కేవలం జయంతి, వర్ధంతులను నిర్వహించడానికి కాదని, గొప్ప వ్యక్తులు చేసిన త్యాగాలు, వారి గొప్పతనాన్ని విగ్రహాల ద్వారా స్ఫూర్తి పొందడానికి వేదికలుగా నిలుస్తాయని అన్నారు. మహనీయుల స్ఫూర్తితో విద్యలో రాణించడమే కాకుండా సామాజిక చైతన్యంతో, సమాజ అభివృద్ధి కోసం పాటుపడాలన్న ఉద్దేశంతో ఇక్కడ విగ్రహావిష్కరణ చేశామని చెప్పారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.