వంటింట్లో మండుతున్న ధరల సెగ
సామాన్యుడి నడ్డి విరుస్తున్న ప్రభుత్వాలు
– టీడీపీ నగర నాయకుడు నల్లెల్ల కిషోర్ ధ్వజం
హైదరాబాద్, మార్చి 9, అద్దం న్యూస్ : అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపి, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచుతూ సామాన్య, మధ్య తరగతి ప్రజల పొట్ట కొడుతున్న ప్రభుత్వ తీరుపై తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ జిల్లా నాయకుడు నల్లెల్ల కిషోర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హైదరాబాద్ దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయనే నెపంతో చమురు సంస్థలు గ్యాస్ ధరలను భారీగా పెంచి సామాన్యుడిపై భారం మోపాయని ధ్వజమెత్తారు. డొమెస్టిక్ సిలిండర్ ధరపై రూ. 60 పెంచి, ప్రస్తుతం రూ. 965కి పెంచారని… మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా లోకానికి ధరలు పెంచి ‘చేదు బహుమతి’ ఇచ్చారని విమర్శించారు. చిన్న వ్యాపారుల ఆత్మఘోష అనుభవిస్తున్నారని, కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,961 నుండి ఏకంగా రూ. 2,105కి పెరిగిందని.. దీనికి అదనంగా సర్వీస్, ట్రాన్స్‌పోర్ట్ చార్జీల పేరుతో రూ. 200 నుండి రూ. 500 వరకు వసూలు చేస్తూ వేధిస్తున్నారన్నారు. దీనివల్ల హోటళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకులపై నెలకు సుమారు రూ. 25,000 నుండి రూ. 30,000 వరకు అదనపు భారం పడుతోందని అన్నారు.
వినియోగదారులు ఒక ధర వద్ద గ్యాస్ బుక్ చేసుకుంటే, డెలివరీ సమయానికి పెరిగిన ధరను వసూలు చేయడం దోపిడీకి పరాకాష్ట అని అన్నారు. బుక్ చేసిన సిలిండర్‌కు రూ. 905 కి, మూడు రోజుల తర్వాత రూ. 965 చెల్లించాలని మెసేజ్ రావడం విడ్డూరంగా ఉందన్నారు. నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణలో ప్రభుత్వం వైఫల్యం ప్రస్ఫుటంగా కన్పిస్తుందని, గ్యాస్‌తో పాటు బియ్యం, పప్పులు, వంట నూనెల ధరలు కూడా విపరీతంగా పెరిగాయని, సోనా మసూరిపై రూ.3, హెచ్ఎంటీపై రూ.4, బాస్మతి బియ్యంపై రూ.9 వరకు పెరగడం సామాన్యుడికి శరాఘాతంగా మారిందన్నారు. యుద్ధం పేరు చెప్పి వ్యాపారులు వంట నూనెలను నిల్వ చేస్తూ బ్లాక్ మార్కెట్ కృత్రిమ కొరత సృష్టిస్తున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం తమ వద్ద ఎన్ని రోజులకు సరపడ నిల్వలున్నాయన్న సమాచారమిచ్చి ప్రజలు ఆందోళన చెందవద్దని ఏ ఒక్క మంత్రి గాని, అధికారి గాని ముందు వచ్చి భరోసా ఇవ్వడం లేదని వాపోయారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వం సబ్సిడీల ద్వారా భరించాలని పేర్కొన్నారు. లేనిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి భారీ ఎత్తున పోరాటాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర నాయకులు పి.బాలరాజ్ గౌడ్, శ్యామ్ సుందర్, జి.అనిల్ కురుమ, ఎస్.ప్రకాష్, కరణం కిరణ్, సుక్రవేది, కె.శంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.













Leave a Reply