...

REVANTH REDDY : ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ – తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) చీఫ్ కల్వకుంట్ల కవిత

ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ
హైదరాబాద్ ప‌బ్లిక్‌ స్కూల్ విరాళాల లెక్క‌లేవి ?
బిఆర్ఎస్ హ‌యాంలో వేసిన తిరుప‌తిరావు క‌మిష‌న్ ఒక్క అడుగు ముందుకు వేయ‌లేదు
– తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) చీఫ్ కల్వకుంట్ల కవిత

హైదరాబాద్ బ్యూరో, మే 6, ( అద్దం న్యూస్ ) :  ముఖ్యమంత్రే విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ అని తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వ్యవహారంలో కచ్చితంగా ముఖ్యమంత్రి రివ్యూ చేయాలని, ఈ విషయంలో ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకోవాలని క‌విత డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చాక ఫీజుల నియంత్రణ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తిరుపతి రావు కమిషన్ వేసిందని, ఆ కమిషన్ అధ్యయనం చేసి రిపోర్ట్ కూడా ఇచ్చిందన్నారు. కానీ ఫీజు రీయింబర్స్‌మెంట్ విషయంలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని విమ‌ర్శించారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 120 శాతం ఫీజు పెరిగితే…నారాయణ, చైతన్య లాంటి స్కూళ్లలో ఎంత పెంచుతారు ? అని ఆమె ప్ర‌శ్నించారు. ఈ ముఖ్యమంత్రి ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్ లకు వెళ్తూ ఏం సందేశం ఇస్తున్నట్లు ? అని మండిప‌డ్డారు. ప్రైవేట్ విద్యాసంస్థలను దోపిడీని ముఖ్యమంత్రే ప్రోత్సహిస్తున్నట్లా ? అని ప్ర‌శ్నించారు. హైదరాబాద్ ప‌బ్లిక్‌ స్కూల్ లో చదివి గొప్ప వాళ్లు అయిన వాళ్లు డొనేషన్లు ఇస్తున్నారని…ఇటీవలే ఆ స్కూల్ పూర్వ విద్యార్థి సత్య నాదెళ్ల పెద్ద ఎత్తున విరాళం ఇచ్చారని.. వాటన్నింటికీ అసలు ఎలాంటి లెక్క లేదన్నారు. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్వర్యంలో హైద‌రాబాద్‌ సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో బుధ‌వారం నిర్వహించిన నాణ్యమైన విద్య–ఫీజుల నియంత్రణ పై రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) చీఫ్ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ… తెలంగాణలో చాలా మంది బడ్జెట్ స్కూళ్లను, కాలేజీలను నడిపించార‌ని, కొంత మంది యువత కలిసి విద్యార్థుల తల్లితండ్రులకు భారం పడకుండా కాలేజ్ లు, స్కూల్స్ నడిపించారన్నారు. కానీ ఆ స్కూల్స్ నడవకుండా కార్పొరేట్ స్కూల్స్ వాళ్లను మింగే ప్రయత్నం చేశారని విమ‌ర్శించారు. ఎథిక్స్ తో నడిచే స్కూళ్లతో మాకు ఎలాంటి సమస్య లేదని, తెలంగాణ సమాజానికి సమస్య ఉందంటే…తెలంగాణ రక్షణ సేనకు కూడా సమస్య ఉన్నట్లే అని అన్నారు. ఫీజుల దోపిడీకి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఒక్కటి కావాలని, అన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల ముందు ధర్నా చేయాల్సిన అవసరముందన్నారు. 50 శాతం నుంచి 120 శాతం స్కూల్ ఫీజులు పెంచినా పట్టించుకోవడం లేదన్నారు. 1200 మంది బలిదానాలతో వచ్చిన తెలంగాణలో 12 ఏళ్లుగా ఆ సంవేదనతో పాలన సాగలేదని ధ్వ‌జ‌మెత్తారు. మే నెలలోనే ఫీజుల నియంత్రణ చట్టం తేవాలని ఆమె ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉచిత విద్య, వైద్యం మా పార్టీ విధానమ‌ని, సమానత్వం, స్వేచ్ఛ, మాన విలువలు వర్థిలాలంటే విద్య ద్వారానే సాధ్యమని ప్రపంచం గుర్తించిందన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్ అనేది ప్రభుత్వాలకు అబ్లిగేషన్ గా ఉండాలన్నారు. ఉచిత విద్య, వైద్యం ప్రభుత్వాల భాద్యతేనని నమ్మిన ప్రభుత్వాలు ఉండాలని సూచించారు. కానీ ప్రజలు ఏమైతే మాకేంటీ, ఫీజులు ఎంత పెంచిన నిమ్మకు నీరెత్తినట్లు ఉంటామంటే కుదరదన్నారు. ఫీజులు కట్టలేక పంజాబ్ లో విద్యార్థులు పార్ట్ టైమ్ మద్యం అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పుడున్న చాలా విద్యాసంస్థలు వ్యాపార ధోరణితో ఉన్నావేన‌ని, వాటిలో రాజకీయ నాయకులకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయన్నారు. రాజకీయ నాయకులకే విద్యాసంస్థలు ఉండటమనేది కరెక్టా అనేది మనం ఆలోచించాలన్నారు. అదే విధంగా ఫీజుల దోపిడీకి మనకు ఇప్పుడే సొలుష్యన్ కావాలన్నారు. వచ్చే నెలలో మళ్లీ ఫీజులు కట్టాలన్న ఆందోళన పిల్లల తల్లితండ్రులకు ఉంటుందని, చాలా మంది తల్లితండ్రులు ఇప్పటికే ఫీజుల విషయంలో భయంతో ఉన్నారని ఆమె స్ప‌ష్టం చేశారు.

గురుకులాలు ఏర్పాటు చేశామని…ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడీని పట్టించుకోమంటే కుదరదన్నారు. మన రాష్ట్రంలో 64 లక్షల మంది విద్యార్థులు ఉంటే 65 నుంచి 75 శాతం వరకు ప్రైవేట్ స్కూళ్లలోనే చదువుతున్నారన్నారు. పిల్లలు బాగా చదువుకోవాలన్న తల్లితండ్రుల వీక్ నెస్ ను వ్యాపార ధోరణిగా మార్చేశారన్నారు. ఈ ప్రభుత్వం కచ్చితంగా కార్పొరేట్ స్కూళ్ల దోపిడీని నియంత్రించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు సంబంధించిన జీవో ను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు జీవో ఇస్తేనే లక్షలాది మంత్రి తల్లితండ్రులకు ఉపశమనం లభిస్తుందని క‌విత అభిప్రాయ‌ప‌డ్డారు. గతేడాదితో పోలిస్తే ఒక్క రూపాయి కూడా ఫీజు పెంచకుండా తక్షణమే జీవో ఇవ్వాలన్నారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేది ప్రభుత్వ స్థలంలో ఉన్న స్కూల్ అని, ఈ స్కూల్లో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 120 శాతం ఫీజు పెంచేశారన్నారు. ప్రభుత్వానికి చెందిన స్కూల్లోనే 120 శాతం ఫీజు పెంచటమంటే ఏంటీ దౌర్భాగ్యమ‌ని ధ్వ‌జ‌మెత్తారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 30 ఎకరాల భూమిని కొట్టేసే కుట్ర చేస్తున్నారని, అక్కడి కమిటీలో ముఖ్యమంత్రి బంధువులు, ప్రభుత్వ పెద్దలు ఉన్నారని ఆరోపించారు. అదే స్కూల్లో 14 ఏళ్లుగా ఒక పోస్ట్ లో మహిళ ఉన్నారని.. ఆమె బోర్డులోకి వచ్చిన వారికి అవినీతి ఎలా చేయాలో నేర్పిస్తున్నారన్నారు.

దాదాపు 11 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని, దీంతో కాలేజీలు మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను బొంద పెట్టే విధంగా ఎంఎస్–7 అనే జీవోను తెచ్చారని విమ‌ర్శించారు. ఈ జీవో కొట్టివేసే వరకు అన్ని పార్టీలు పోరాటం చేయాల్సి ఉందిన్నారు. రైతు భరోసా విషయంలో కూడా ఇదే జరుగుతోంది. రైతు భరోసా వేయకపోతే రైతులు బయటకు వచ్చి పోరాటం చేసే పరిస్థితి లేదన్నారు. ఉచిత విద్య, వైద్యం విషయంలో నేను మాట తప్పనని, నేను ఆడపిల్లను. అబ్దమాడనని, ఇన్నాళ్లు అయ్యల పాలనలో మోసం జరిగిందన్నారు. కానీ నేను అమ్మలా ఆలోచించే వ్యక్తిని.. కచ్చితంగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాన‌న్నారు. తమిళనాడు తరహాలో మన వద్ద కూడా ఫీజు నియంత్రణ కోసం పర్మినెంట్ అథారిటీ ఉండాలని, లేదంటే గుజరాత్ లో మాదిరిగా ప్రాథమిక విద్యకు రూ.15 వేలు, ఉన్నత విద్యకు రూ.25 వేలకు మించి ఫీజు ఉండొద్దన్నారు. ఇందులో ఏ మోడల్ ను అయిన స్టడీ చేసి ప్రభుత్వం వాటిని అమలు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ స‌మావేశంలో విద్యార్థి సంఘాల నాయ‌కులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.