శిరీష పై హత్యాచారానికి పాల్పడిన దుండగుడిని కఠినంగా శిక్షించాలి
– ఐద్వా
హైదరాబాద్, సెప్టెంబర్ 7, ( అద్దం న్యూస్ ) : తుక్కుగూడలో ప్రైమ్ కేర్ ఆసుపత్రిలోని నర్సు శిరీష ను అతిదారుణంగా హత్యాచారం చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని శిరీష కుటుంబానికి న్యాయం చేయాలని ఐద్వా హైదారాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ తరఫున గోల్కొండ క్రాస్ రోడ్ లో ధర్నా జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.నాగలక్ష్మి, నగర అధ్యక్ష, కార్యదర్సులు ఏ.పద్మ, వై.వరలక్ష్మి లు మాట్లాడుతూ… ప్రైమ్ కేర్ ఆసుపత్రిలో మహిళా సిబ్బందికి సరైన భద్రత కల్పించని ఆసుపత్రి యాజమాన్యంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నిందితుడిని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా విచారించి వెంటనే కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రభుత్వం తనిఖీలు నిర్వహించాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరారు. పేద కుటుంబమైన శిరీష కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, వారి కుటుంబానికి తక్షణం తగిన ఆర్ధిక సాయం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని వారు కోరారు. ప్రైవేటు ఆసుపత్రులలో రోగుల వద్ద లక్షల రూపాయలు వసూలు చేసే యాజమాన్యాలు సిబ్బందికి కనీస వేతనాలు, కనీస భద్రత కల్పించక పోవడం సిగ్గు చేటని ఇప్పటికైనా ప్రభుత్వం అన్ని ఆసుపత్రులలో తనిఖీలు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం మహిళలపై హింసకు కారణమవుతున్న పోర్న్ వెబ్సైట్లను నిషేధించాలని, గంజాయి, మత్తుపదార్ధాలను నిర్మూలించే చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నగర నాయకులు షాబాణా, భవాని, ప్రవళిక, శారద, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.![]()














Leave a Reply