ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించడమే ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యం
– జన చైతన్య సభలో ఆమ్ ఆద్మీ పార్టీ పిలుపు
హైదరాబాద్, జూన్ 20, ( అద్దం న్యూస్ ) : ప్రజా సమస్యలను గాలికొదిలేసి, రైతుల పొట్టగొడుతున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించాలని ఆమ్ ఆద్మీ పార్టీ ( AAP ) ప్రజలకు పిలుపునిచ్చింది. శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో ‘ జన చైతన్య సభ ‘ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ ప్రియాంక కక్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వారితో పాటు ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు, వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాము గౌడ్, జనరల్ సెక్రటరీలు డాక్టర్ అన్సారి, హైదర్, చీఫ్ స్పోక్స్ పర్సన్ దిడ్డి సుధాకర్, స్పోక్స్ పర్సన్ పరీక్షల రాజు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
సభను ఉద్దేశించి ప్రియాంక కక్కర్ మాట్లాడుతూ… తెలంగాణలో హిట్లర్ పాలన నడుస్తోందని, రేవంత్‌రెడ్డి లాంటి హిట్లర్‌ను అధికార పదవి నుంచి తొలగించాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ‘ ఫ్యూచర్ సిటీ ‘ ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న భూసేకరణ, తద్వారా స్థానిక రైతాంగం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్యలను నాయకులు ప్రజలకు విడమర్చి చెప్పారు. అభివృద్ధి పేరుతో రైతుల నోట్లో మట్టి కొడుతున్న ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. రెండు లక్షల రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదని, వెంటనే రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. నాణ్యమైన ఉచిత విద్యను అమలు చేయాలని, విద్యారంగానికి బడ్జెట్‌లో 15 శాతం వరకు పెంచాలని, అన్ని ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఖాళీగా బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ విద్యార్థులకు సకాలంలో స్కాలర్‌షిప్ లు అందచేయాలన్నారు. ఆరోగ్య శ్రీ పథకం కింద అన్ని రకాల వ్యాధులకు 10 లక్షల వరకు వర్తింపజేయాలని, ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని కోరారు.
ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ హేమ సుదర్శన్ జిల్లోజు మాట్లాడుతూ… స్వయం సహాయక బృందాలకు పావుల వడ్డీ రుణాలను అందజేయాలని, ప్రతి మహిళ కు 2500 రూపాయలతో పాటు కాలేజీ విద్యార్థినులకు స్కూటీ నీ వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. మహిళ పోలీస్ వ్యవస్థను ప్రతిష్టపరిచి పట్టణాలతోపాటు గ్రామాలకు విస్తరించాలన్నారు. రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని, 4000 రూపాయల నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలన్నారు. యూత్ కమిషన్ ఏర్పాటు చేసి పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, ప్రభుత్వ రాయితీలు పొందిన ప్రైవేట్ కంపెనీలలో తెలంగాణ యువతకు 75 శాతం రిజర్వేషన్‌ను కల్పించాలన్నారు. ప్రస్తుత పాలకుల అవినీతి, వైఫల్యాలను ఎండగడుతూ, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దించే వరకు విశ్రమించబోమని సభకు విచ్చేసిన ప్రజలు, కార్యకర్తల చేత నాయకులు ప్రతిజ్ఞ చేయించారు. రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహ్మద్ సోహైల్, జావీద్ షరీఫ్, రాకేష్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.![]()

![]()













Leave a Reply